‘మెప్మా’లో వణుకు

16 Feb, 2015 03:42 IST|Sakshi
‘మెప్మా’లో వణుకు

మెప్మాలో కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు టెన్షన్ నెలకొంది. బినామీ సంఘాలు మొదలు ఉపకార వేతనాలు, పావలా వడ్డీ, జనశ్రీ బీమా యోజన కింద మొత్తంగా రూ.కోట్లలో అవినీతి చోటు చేసుకుంది. పదిరోజులుగా ఒక్కో విభాగం అవినీతి బయటపడుతుండడంతో సిబ్బంది, అధికారులకు ఏం జరుగుతుందోనని వణుకు పుడుతోంది. రాష్ట్రబృందం సోమవారం విచారణకు రానుండటంతో సంస్థలో నిశ్శబ్దం ఆవరించింది. సిబ్బంది గుండెలు గుబేల్‌మంటున్నాయి. గప్‌చుప్‌గా అన్నీ సర్దేపనిలో పడ్డారు.
 
 సాక్షి, ఖమ్మం:మెప్మాలో కిందిస్థాయి సిబ్బంది నుంచి జిల్లా ఉన్నతాధికారుల వరకు ఆందోళన నెలకొంది. పదిరోజులుగా ఒక్కో విభాగం అవినీతి బయటపడుతుండటం.. రాష్ట్రబృందం సోమవారం విచారణకు వస్తుండటంతో సంస్థ సిబ్బంది అప్రమత్తం అవుతున్నారు. అవినీతి బట్టబయలు కాకుండా అన్నీ సర్దేపనిలో పడ్డారు.  బీనామీ సంఘాల పేరుతో మెప్మా సిబ్బంది, అధికారులు రూ.కోట్లు దండుకున్నారు. దీనిపై పత్రికల్లో వార్తలు వస్తుండటంతో జిల్లాలో ఏ మేరకు అవినీతి జరిగిందోనని ఆ సంస్థ రాష్ట్ర ఉన్నతాధికారులు నిఘా పెట్టారు. ఇందులో భాగంగానే ముగ్గురు సభ్యులతో కూడిన బృందంసోమవారం విచారణకు వస్తుంది.
 
 ‘జనశ్రీ’ సొమ్ము స్వాహా!
 జనశ్రీ బీమా యోజన కింద బతికి ఉన్న సభ్యుల పేరు మీద రూ.50 లక్షల వరకు స్వాహా చేసినట్లు సమాచారం. సమాఖ్యలో సభ్యులుగా ఉన్న మహిళలు ఈ పథకం కింద రూ.120 చెల్లించాలి. ఇలా చెల్లించిన వారిలో ఎవరైనా ఏడాది లోపు చనిపోతే అంత్యక్రియల ఖర్చు కింద రూ.5వేలు, ఆ తర్వాత మరణ ద్రువీకరణ పత్రం అందజేస్తే మరో రూ.25 వేలు ఆ కుటుంబానికి ఇస్తారు. 2010-11లో ఈ పథకం కింద ఐదుగురు సభ్యుల కుటుంబాలు ప్రయోజనం పొందినట్లు చూపారు. 2013-14, 2014-15లో ఇప్పటి వరకు 317 మంది సభ్యుల కుటుంబాలు ఒక్కోదానికి రూ. 30 వేల చొప్పున చెల్లించడం గమనార్హం. ఇందులో కొంత మంది వాస్తవంగా చనిపోతే మరికొంత మంది సభ్యులు బతికి ఉన్నా చనిపోయినట్లు వారి పేరు మీద మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీమా సొమ్ము సంస్థ సిబ్బందే బొక్కేసినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ.50 లక్షల వరకు ఇలా స్వాహా చేసినట్లు సమాచారం. నగరంలోని 6వ వార్డులో ఇలా ఇద్దరు సభ్యులు బతికి ఉన్నా వారి పేరు మీద బీమా సొమ్ము స్వాహా చేసినట్లు ఇటీవల బయటపడడంతో సదరు సభ్యులు సంస్థ అధికారులను నిలదీశారు. ఆ తర్వాత ఈ బండారం బయటకు పడకుండా సెటిల్‌మెంట్ చేసినట్లు తెలిసింది. ఇలా ఎక్కువ మంది సభ్యులకు తెలియకుండానే వారి బీమా సొమ్ము సంస్థ సిబ్బంది, అధికారుల జేబుల్లోకి వెళ్లింది. సభ్యుల రేషన్, ఆధార్‌కార్డులు అవసరం ఉంటాయని ముందుగానే జీరాక్స్ తీసుకొని వారికి తెలియకుండానే స్వాహా పర్వానికి తెరలేపారు.
 
 అంతా గప్‌చుప్..
 భారీ ఎత్తున మెప్మాలో అవినీతి వెలుగు చూడడం.. ఒక సీఓను ఇప్పటికే విధుల నుంచి తప్పించడంతో రాష్ట్ర కమిటీ విచారణ బృందం వస్తుందని తెలుసుకున్న స్థానిక అధికారులు అంతా సర్దేసినట్లు సమాచారం. విచారణకు వచ్చే అధికారుల ముందు నొరు విప్పకుండా.. ‘ నోరు విప్పితే మీ ఉద్యోగాలు పోతాయి.. ఈ రెండు రోజులు సార్ చెప్పినట్లు వినండి. ఆ తర్వాత అంతా సర్దుకుపోతుంది. లేకపోతే సార్‌కు కోపం వస్తుంది’ అని మెప్మాలో ఓ ఉద్యోగిని సిబ్బంది నోటికి తాళం వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.
 
 బినామీ సంఘాలతో రూ.లక్షల్లో మెప్మా కింద రుణాలు స్వాహా చేయడంతో ఈ అవినీతిలో భాగస్వామ్యం ఉన్న వారంతా తిరిగి డబ్బులు చెల్లించేలా సదరు ఉద్యోగిని ఎక్కడికక్కడ సెటిల్‌మెంట్లు చేసినట్లు ఆరోపణలు వస్తున్నారుు. అసలు భాధ్యులైన వారిని ఏమీ అనకుండా తమపై ఎందుకు చర్యలు తీసుకుంటారని సంస్థ సిబ్బంది ఉన్నతాధికారుల తీరును ప్రశ్నిస్తున్నారు. అధికారులు చేయమంటేనే చేశామని.. ఇప్పుడు తమ మెడుకు చుడుతున్నారని, తాము కొంత చేస్తే అధికారులు కొండంత అవినీతికి పాల్పడ్డారని.. మెప్మా సిబ్బంది ప్రస్తుతం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటుడటం గమనార్హం. అయితే క్షేత్రస్థాయిలో విచారణ బృందం తనిఖీలు చేస్తేనే మెప్మాలో భారీ కుంభకోణం బయటపడుతుందని పలువురు అంటున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు