జయహో జనతా..

23 Mar, 2020 02:00 IST|Sakshi

జనతా కర్ఫ్యూకు అనూహ్య స్పందన 

స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొన్న ప్రజలు

ఇళ్ల నుంచి బయటకు రాని జనం 

చప్పట్లు కొట్టే కార్యక్రమానికి నీరాజనం

సాక్షి, హైదరాబాద్‌ : పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ ఆదివారం ‘జనతా కర్ఫ్యూ’ పేరుతో ఉద్యమ స్ఫూర్తిని చాటిచెప్పింది. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిలుపు మేరకు స్వచ్ఛందంగా కర్ఫ్యూ విధించుకుంది. కులం, మతం, ప్రాంతం, వయసుతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు జనతా కర్ఫ్యూ ను పాటించారు. ఉదయం 6 గంటల నుంచి ఆదివారం రోజంతా ఎవరూ బయటకు రాలేదు. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాలు, పల్లెల్లోని ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ముందే ఖరారైన పెళ్లిళ్లు మినహా అన్ని శుభకార్యాలను రద్దు చేసుకున్నారు. రోడ్లపైకి ఎవరూ రాకపోవడంతో రాష్ట్రంలోని అన్ని రోడ్లు నిర్మానుష్యమయ్యాయి. రోజూ కిటకిటలాడే ప్రాంతాలు, మార్కెట్లు, రైతు బజార్లు, బస్‌స్టేషన్లు, రైల్వే స్టేషన్లలో ఎవరూ కనిపించలేదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడంతో ప్రజా రవాణా కోసం వాహనాలను నడపాల్సిన అవసరం కూడా రాలేదు. అత్యవసర సర్వీసులు మినహా అన్ని రంగాలు లాక్‌డౌన్‌ కావడంతో ఆదివారం రాష్ట్రంలో జనజీవనం స్తంభించింది. 

అంతటా అద్భుత స్పందన...
ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్‌ పిలుపులకు రాష్ట్రంలో అద్భుత స్పందన లభించింది. హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర సరిహద్దు గ్రామాల వరకు అన్ని ప్రాంతాల్లోని ప్రజలు కర్ఫ్యూలో స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు ఆదివారం సెలవు కావడం, స్వచ్ఛం దంగా ప్రజలు కరోనాపై యుద్ధం ప్రకటించడంతో రాష్ట్రమంతా 144 సెక్షన్‌ తలపించింది. వ్యాపార వర్గాలు కూడా సహకరించడంతో రాష్ట్రంలోని దాదాపు అన్ని దుకా ణాలు బందయ్యాయి. నిత్యపూజలు మినహా ప్రార్థన మందిరాల్లో కూడా జనసంచారం కనిపించలేదు. నిత్యం రద్దీగా ఉండే రైతు బజార్లు, మార్కెట్లకు కూడా ప్రజలు వెళ్లలేదు. ఆదివారం బంద్‌ ఉంటుందనే ఉద్దేశంతో శనివారమే నిత్యావసరాలు, పాలు, కూరగాయలు తెచ్చుకున్న ప్రజానీకం రోజంతా ఇళ్లలోనే ఉండిపోయారు. రాష్ట్ర ప్రభుత్వం అంతర్రాష్ట్ర సరిహద్దులను మూసివేయడంతో ఇతర రాష్ట్రాల నుంచి ఒక్క వాహనం కూడా మన రాష్ట్రంలోకి ప్రవేశించలేదు. (మరో ఆరుగురికి కరోనా పాజిటివ్‌..)


మన రాష్ట్రంలో కూడా రోడ్లపై వాహనాలు కనిపించలేదు. ఒకటో, రెండో వాహనాలు తిరిగినా హైదరాబాద్‌లో రోడ్లన్నీ బోసిపోయాయి. శనివారమే రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో కర్ఫ్యూ గురించి ప్రచారం చేయడంతో ఎవరూ బయటకు వచ్చేందుకు సాహసించలేదు. కొందరు బయటకు వచ్చినా వారికి పోలీసులు కౌన్సిలింగ్‌ చేశారు. కొన్ని ప్రాంతాల్లో అనవసరంగా బయటకు వచ్చిన వారితో సామాజిక సేవ చేయించారు. కరోనా విస్తరించకుండా అనుసరించాల్సిన పద్ధతులతో కూడిన పోస్టర్లను రోడ్లపై వారితో ప్రదర్శింపజేశారు. కాగా, మారుమూల గ్రామాల్లోని ప్రజలు కూడా స్వచ్ఛందంగా కర్ఫ్యూలో పాల్గొనడం విశేషం. పల్లెల్లోనూ ఎవరూ ఇళ్ల నుంచి అనవసరంగా బయటకు రాలేదు. అత్యవసరమైతే తప్ప వ్యవసాయ పనులకు కూడా వెళ్లకపోవడం గమనార్హం. ఇక, పట్టణాలు, నగరాల్లో యథావిధిగా కర్ఫ్యూ పాటించారు. ఉదయం నుంచే గల్లీల్లో నిర్మానుష్య వాతావరణం కనిపించింది. చిన్న చిన్న సందుల్లో ఉండే దుకాణాలు సైతం బంద్‌ చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే పరిస్థితి కొనసాగింది. మొత్తంమీద ఆదివారమంతా రాష్ట్రంలో అనవసర సంచారం లేకుండా ప్రజలు సామాజిక స్ఫూర్తిని చాటి చెప్పారు. (మీ స్ఫూర్తి.. స్వీయ నియంత్రణకు థ్యాంక్స్‌..)

రాజకీయులకు ‘రిలీఫ్‌’..
బంద్‌లయినా, కర్ఫ్యూలయినా ఎప్పుడూ బిజీగా ఉండే రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు ఆదివారం రిలాక్స్‌ అయ్యారు. చాలాకాలం తర్వాత తమ ఇళ్లలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సేపు గడిపారు. సీఎం కేసీఆర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్షలు, సమావేశాల్లో బిజీగా ఉండగా, రాష్ట్ర మంత్రులు ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. మరికొందరు మంత్రులు కూడా ప్రగతి భవన్‌లో సమీక్షలకు హాజరయ్యారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ తమ ఇళ్లకే పరిమితం అయిపోయారు. 

చప్పట్లకు జన నీరాజనం..
ఇక సాయంత్రం 5 గంటలకు బాల్కనీలు, కూడళ్లలోకి వచ్చి చప్పట్లు కొట్టడం ద్వారా ఐక్యతా సంకేతాన్ని చాటి చెప్పడం రాష్ట్ర ప్రజల నిబద్ధతను చాటిచెప్పింది. కేసీఆర్‌ ప్రగతిభవన్‌లో తన కుటుంబ సభ్యులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు మంత్రులు, తన కార్యాలయ అధికారులతో కలసి చప్పట్లు కొట్టి... వైద్య, శానిటేషన్, ఇతర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌ తమిళిసై కూడా రాజ్‌భవన్‌లో తన సిబ్బందితో కలసి చప్పట్లు కొట్టారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, వ్యాపార, సినీ ప్రముఖులే కాకుండా సామాన్య ప్రజానీకం కూడా తమ కృతజ్ఞతలు పెద్ద ఎత్తున తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి హైదరాబాద్‌ వరకు సాయంత్రం ఐదు గంటల సమయంలో మారుమోగిపోయింది.  

మరిన్ని వార్తలు