నాడు జేసీ.. నేడు కలెక్టర్‌

28 Sep, 2017 11:46 IST|Sakshi

నాడు జేసీ.. నేడు కలెక్టర్‌

 బతుకమ్మ కుంట వివాదంలోకి   

మరోసారి ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి భూకబ్జాపై కలెక్టర్‌ ప్రత్యక్ష ఆరోపణ

కలెక్టర్‌పై సీఎస్‌కు ఫిర్యాదు చేసిన ముత్తిరెడ్డి

సభా హక్కుల ఉల్లంఘన

నోటీసు జారీ కోసం ప్రయత్నాలు

కలెక్టర్‌కు బాసటగా నిలుస్తున్న ప్రతిపక్షాలు

బతుకమ్మ కుంట వివాదం చిలిచిలికి గాలివానలా మారుతోంది. గతంలో ఈ కుంట వ్యవహారంలో అప్పటి ఉమ్మడి జిల్లా జేసీ, ప్రస్తుతం వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌తో వివాదంలో చిక్కిన ఎమ్మెల్యే ముత్తిరెడ్డి.. తాజాగా మరోమారు కలెక్టర్‌ శ్రీదేవసేన చేసిన వ్యాఖ్యలతో చిక్కుల్లో పడ్డారు. అయితే కలెక్టర్‌ చేసిన ఆరోపణలపై ముత్తిరెడ్డి సీఎస్‌కు ఫిర్యాదు చేయడం, కలెక్టర్‌కు ప్రతిపక్ష పార్టీలు మద్దతు తెలపడం వంటి ఘటనలతో ఈ వివాదం కొత్త మలుపులు తిరుగుతుంది.

సాక్షి, జనగామ : కలెక్టర్‌ శ్రీదేసేన, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మధ్య తలెత్తిన బతుకమ్మ కుంట బేధాభిప్రాయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కుంటలోని శిఖం భూమిని స్వయంగా ఎమ్మెల్యే కబ్జా చేశారని కలెక్టర్‌గా ప్రకటించడంతో ఈ వివాదం మరింత ముదిరింది. ఇదిలా ఉంటే కలెక్టర్‌పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రభుత్వ ఛీప్‌ విప్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. అంతే కాకుండా అసెంబ్లీ కార్యదర్శిని కలిసి తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కలెక్టర్‌ వ్యవహరించారని వివరించినట్లు సమాచారం. ఈ వరుస ఘటనలతో బతుకమ్మ కుంట వివాదం మరింత జఠిలం మారుతోంది. అయితే కలెక్టర్‌కు మాత్రం సీపీఐ, సీపీఎం, టీడీపీ, బీజేపీ, ప్రజాఫ్రంట్‌ నాయకులు అండగా నిలిచారు.

నాడు పనులకు అడ్డు చెప్పిన జేసీ..
జనగామ ఎమ్మెల్యే, కలెక్టర్‌ మధ్య వివాదానికి కారణమైన బతుకమ్మ కుంట మరోసారి వార్తలెక్కింది. గతంలో బతుకమ్మ కుంట వివాదంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పరువు పోయింది. సూర్యాపేట రోడ్డులో ఉన్న ధర్మోనికుంట ప్రస్తుత బతుకమ్మ కుంటను 2015లో మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయడానికి ప్రతిపాదనలు రెడీ చేసి ప్రభుత్వానికి పంపించారు. దీంతో అప్పటి ఉమ్మడి జాయింట్‌ కలెక్టర్, ప్రస్తుత వరంగల్‌ రూరల్‌ జిల్లా కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ బతుకమ్మ కుంటను సందర్శించారు. బతుకమ్మ కుంటను అభివృద్ధి పేరుతో హద్దులు చేరిపేయడం, కుంట ప్రాంతాన్ని మట్టితో పూడ్చి వేయడం సుప్రీం కోర్టు నిబంధనలకు విరుద్ధమని తేల్చి చెప్పారు.

రెండు సార్లు ప్రతిపాదనలను పంపినప్పటికీ అప్పటి జేసీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తిరస్కరించారు. దీంతో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నేరుగా హన్మకొండకు వెళ్లి జేసీతో వాగ్వివాదానికి దిగారు. అప్పట్లో జేసీ పట్ల ఎమ్మెల్యే వ్యవహరించిన తీరు వివాదమైంది. అంతలోనే జేసీ బదిలీ కావడంతో ఇష్టారాజ్యంగా బతుకమ్మ కుంట పనులను చేపట్టారు. నిబంధనలు పాటించకుండా ఐదు ఎకరాల స్థలంలో దేవాదుల కాల్వల నుంచి మట్టిని తీసుకువచ్చి పూడ్చి వేశారు. ఇప్పుడు బతుకమ్మ కుంట పనులపై కలెక్టర్‌ దేవసేన అభ్యం తరం వ్యక్తం చేస్తున్నారు. బతుకమ్మ కుంట స్థలాన్ని ఆక్రమించినట్లు బహిరంగంగానే ఆరోపించారు. ట్రస్టీ పేరుతో దుర్గమ్మగుడిని ఎమ్మెల్యే పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారని, దానిని రద్దు చేయించానని చెప్పడం మరోమారు ముత్తిరెడ్డి వివాదంలో చిక్కుకున్నారు.

కలెక్టర్‌పై సీఎస్‌కు ఫిర్యాదు...
బతుకమ్మ కుంట విషయంలో కలెక్టర్‌ దేవసేన చేసిన వ్యాఖ్యలపై జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి బుధవారం సాయంత్రం సీఎస్‌కు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ఛీప్‌ సెక్రటరీ వీకే సింగ్‌ను కలిసి పరిస్థితి వివరించినట్లు తెలిసింది. తాను భూకబ్జాకు పాల్పడలేదని వివరించారు. అదేవిధంగా అసెంబ్లీ కార్యదర్శిని కలెక్టర్‌ తన పట్ల వ్యవరించిన తీరును వివరించారు. సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు జారీ చేయాలని విజ్ఞప్తి చేశారు.

ముదురుతున్న వివాదం...
కలెక్టర్‌పై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఫిర్యాదు చేయడం, కలెక్టర్‌కు రాజకీయ పార్టీల నాయకులు మద్దతుగా నిలవడం ఇద్దరి మధ్య వివాదం ముదురుతోంది. కలెక్టర్, ఎమ్మెల్యే మధ్య అంతర్గతంగా ఉన్న బేదాభిప్రాయాలు బతుకమ్మ కుంట సాక్షి బయట పడ్డాయి. విభేదాలు తారస్థాయికి చేరడంతో ఎలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తోందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మరిన్ని వార్తలు