చెప్పని పాఠాలకు పరీక్ష

28 Jan, 2019 10:21 IST|Sakshi

ఆదిలాబాద్‌టౌన్‌: విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరీక్షించేందుకు పాఠశాలలు, కళాశాలల్లో  త్రైమాసిక, అర్ధవార్షిక, వార్షిక పరీక్షలు నిర్వహిస్తుంటారు.. విద్యార్థులకు ఏ మేరకు చదువు అర్థమవుతుందో దీంతో తెలిసిపోతుంది. విద్యా సంవత్సరమంతా చెప్పిన పాఠాలకు పరీక్షలు నిర్వహిస్తుంటే..ఈ రెండు సబ్జెక్టులకు సంబంధించి పరిస్థితి భిన్నం గా ఉంది. చెప్పని చదువుకు పరీక్షలు నిర్వహిస్తుండటం, వాటిపై విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వారు నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంది. ఈ పరీక్ష రాయని విద్యార్థులు మిగతా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనప్పటికీ ఈ పరీక్షలు రాయకుంటే ఫెయిల్‌ అయినట్లే. వీరికి లాంగ్‌మెమోలు రాకపోవడం, డిగ్రీ ప్రవేశానికి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు కాకపోవడంతో చాలా మంది విద్యార్థులు అవస్థలు ఎదుర్కొంటున్నా రు. అవగాహన లేమితోనే ఈ తంటాలు వారికి తప్పడంలేదు. జిల్లాలో ఏటా 10 శాతం మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయడంలేదని అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో.. 
జిల్లాలో మొత్తం 48 ఇంటర్మీడియెట్‌ కళాశాలలు ఉన్నాయి. వీటిలో 13 ప్రభుత్వ కళాశాలలు, 16 ప్రైవేట్, 6 మోడల్‌ స్కూళ్లు, 6 ట్రైబల్‌ వెల్ఫేర్‌ జూనియర్‌ కళాశాలలు, 2 సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలు, 1 మహాత్మా జ్యోతిబాపూలే కళాశాల, 2 వృత్తి విద్యా కోర్సు కళాశాలలు, 2 కస్తూర్భా  బాలికల విద్యాలయాల్లో ఇంటర్‌ విద్యాబోధన జరుగుతోంది. ప్రథమ సంవత్సరంలో 6,950 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరంలో 7,788 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 

ఇంటర్మీడియెట్‌ విద్యార్థులకు పర్యావరణ విద్య, నైతికత–మానవ విలువలు అనే సబ్జెక్టులను బోధించాల్సి ఉంది. అయితే దాదాపు అన్ని కళాశాలల్లో ఈ రెండు సబ్జెక్టుల పాఠాలు చెప్పడంలేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. పరీక్షల సమయంలోనే ఈ సబ్జెక్టులు ఉన్నాయనే విషయం వారికి తెలుస్తోంది. సంవత్సరమంతా ఆ సబ్జెక్టులకు సంబంధించిన బుక్కులు తెరవని విద్యార్థులు పరీక్షల్లో ఏమి రాయాలో తెలియక కొంతమంది గైర్హాజరవుతున్నట్లు తెలుస్తోంది. ఇలా గైర్హాజరైన వారు పరీక్షల్లో మిగతా అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించినా ఈ రెండు సబ్జెక్టులు రాయకపోవడం వల్ల ఫెయిల్‌ అయిన కిందకే వస్తారని అధికారులు చెబుతున్నారు. వారికి లాంగ్‌ మెమోలు రాకపోవడంతో డిగ్రీ విద్యను అభ్యసించలేకపోతున్నారు. దీంతో విద్యా సంవత్సరం నష్టపోవాల్సిన దుస్థితి నెలకొంటోంది.

అవగాహన లేమితోనే.. 
విద్యార్థులకు నైతిక విలువలు, పర్యావరణ గురించి తెలియాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రెండు సబ్జెక్టులను ఇంటర్మీడియెట్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ప్రవేశపెట్టింది. ఉద్దేశం మంచిదే అయినా.. ఆయా కళాశాలల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వ లక్ష్యం నీరుగారుతుండడంతోపాటు విద్యార్థులకు నష్టం వాటిల్లుతోంది. ఈ సబ్జెక్టులను విద్యార్థులకు బోధించకపోవడమే కాకుండా వాటి గురించి అవగాహన కల్పించకపోవడమే దీనికి ముఖ్య కారణమవుతోంది. కళాశాలల యాజమాన్యాల నిర్లక్ష్యమో, ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారుల అలసత్వమేమో కానీ విద్యార్థులకు మాత్రం శాపంగా మారుతోంది. పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో చాలా మంది విద్యార్థులు ఈ రెండు పరీక్షలకు గైర్హాజరవుతున్నట్లు సమాచారం.

నేడు ఎథిక్స్, 31న పర్యావరణ విద్య పరీక్షలు 
నైతికత–మానవ విలువలు, పర్యావరణ విద్య.. అనే అంశాలపై ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు పరీక్షలు నిర్వహిస్తోంది. సోమవారం నైతిక విలువలు (ఎథిక్స్‌), ఈనెల 31న పర్యావరణ విద్యపై పరీక్షలు జరగనున్నాయి. ఆయా కళాశాలల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్న కళాశాలల్లోనే పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సర విద్యార్థులు 6,950 మంది హాజరు కావాల్సి ఉందని ఇంటర్మీడియెట్‌ బోర్డు అధికారులు తెలిపారు.

పరీక్షల్లో పాసైతేనే.. లాంగ్‌ మెమో 
ఎథిక్స్, పర్యావరణ విద్య అనే సబ్జెక్టుల్లో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులు తప్పనిసరిగా పరీక్షలు హాజరుకావాలి. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేస్తున్నాం. గైర్హాజరైన విద్యార్థులు మిగతా సబ్జెక్టుల్లో ఉత్తీర్ణులైనా ఫెయిల్‌ అయిన కిందికే వస్తుంది. దీంతో డిగ్రీ ప్రవేశాల కోసం వారికి లాంగ్‌ మెమో జారీ చేయడం జరగదు. ఈ విషయాన్ని విద్యార్థులు గమనించి పరీక్షలకు హాజరుకావాలి. – దస్రు, డీఐఈఓ, ఆదిలాబాద్‌ 

మరిన్ని వార్తలు