ఉద్యోగులకు మార్గదర్శకుడు జావీద్

28 Dec, 2014 01:55 IST|Sakshi

ఖమ్మం వ్యవసాయం : మార్కెటింగ్ శాఖలో 37 ఏళ్ల పాటు పని చేసిన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి మహ్మద్ అబ్దుల్ జావీద్ ఉద్యోగులకు మార్గదర్శకుడని వరంగల్ మార్కెటింగ్ శాఖ జాయింట్ డెరైక్టర్ టి.సుధాకర్ అన్నారు. ఈ నెలతో ఉద్యోగ విరమణ చేస్తున్న జావీద్‌ను శనివారం మార్కెటింగ్‌శాఖ ఉద్యోగులు సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుధాకర్ మాట్లాడుతూ జావీద్ సేవలను కొనియాడారు.

క్రమశిక్షణగా బాధ్యతలు నిర్వహించడంతో పాటు, రైతుల పక్షాన ఉండి మార్కెటింగ్ శాఖ లక్ష్యం కోసం తన వంతు కృషి చేశారని అన్నారు. రాష్ట్రంలోని పలు మార్కెట్‌లలో పని చేసి తనదైన ముద్ర వేసుకున్నారని అన్నారు.  ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో ఈ-బిడ్డింగ్‌ను ఏర్పాటు చేయించిన ఘనత జావీద్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ను ఆధునీకరించి గుర్తింపును సాధించారన్నారు.  

తెలంగాణ నాన్ గెజిటెడ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగల సంఘం జిల్లా అధ్యక్షులు తాడేపల్లి కిరణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో టీఎన్‌జీవో జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు, కార్యదర్శి పి.రాజారావు, మార్కెట్ కమిటీ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు సీహెచ్ ఖాదర్ బాబా తదితరులు జావీద్‌ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ మార్కెటింగ్ శాఖ జిల్లా సహాయ సంచాలకులు వినోద్ కుమార్, వివిధ మార్కెట్‌లకు చెందిన కార్యదర్శులు, మార్కెట్ ఉద్యోగులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు