వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించండి

15 Dec, 2016 03:16 IST|Sakshi
వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించండి

జయ ఆస్తులపై హైకోర్టులో గరీబ్‌ గైడ్‌ ప్రజా ప్రయోజన వ్యాజ్యం
సాక్షి, హైదరాబాద్‌ : తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆస్తులను ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలైంది. ఈ ఆస్తుల విషయంలో శశికళ, ఇతరులు జోక్యం చేసుకోకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ స్వచ్ఛంద సంస్థ గరీబ్‌ గైడ్‌ అధ్యక్షురాలు జి.భార్గవి ఈ వ్యాజ్యాన్ని ఇటీవల దాఖలు చేశారు.

ఇందులో కేంద్ర హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ తదితరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్‌లో తనకు జీడిమెట్ల, శ్రీనగర్‌ కాలనీల్లో ఆస్తులు ఉన్నట్లు జయలలిత ప్రకటించారన్నారు. ఈ ఆస్తుల విషయంలో జయలలిత ఎటువంటి వీలునామా రాయలేదని, అందువల్ల వాటిని ప్రభుత్వ ఆస్తులుగా ప్రకటించాలని ఆమె కోర్టును కోరారు. హైకోర్టు వెబ్‌సైట్‌ ప్రకారం ఈ వ్యాజ్యాన్ని ఇంకా ప్రధాన నెంబర్‌ కేటాయించలేదు.

మరిన్ని వార్తలు