నేటి నుంచి యాదాద్రిలో ఉత్సవాలు

15 May, 2019 05:43 IST|Sakshi

మూడ్రోజులపాటు వేడుకలు.. అన్ని ఏర్పాట్లు పూర్తి  

యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం నుంచి మూడ్రోజుల పాటు స్వామివారి జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. ఇందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధ వారం ఉదయం 9 గంటలకు విష్వక్సేనారాధనతో ఉత్సవాలను ప్రారంభించనున్నారు. 10:30కి లక్ష పుష్పార్చన, 11:30 గంటలకు తిరువేంకటపతి అలంకారం సేవ, సాయంత్రం 6:30 గంటలకు అంకురార్పణం, మృత్స్యంగ్రహణం, చతుస్థానార్చన, మూర్తి కుంభస్థాపన, మూల మంత్రహవనం, రాత్రి 8:30 గంటలకు గరుడ వాహనంపై పరవాసుదేవ అలంకారం సేవలు జరుగుతాయి.  

20 మంది రుత్విక్కులకు ఆహ్వానం 
ఉత్సవాలను పురస్కరించుకుని అధికారులు మూల మంత్ర జపాలను నిర్వహించడానికి 20 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. సహస్ర కలశాభిషేకాలకు కలశాలను సిద్ధం చేశారు. ఈ మూడ్రోజుల పాటు భక్తులతో నిర్వహించే శాశ్వత పూజలను కూడా నిలిపివేశారు.

నేటి నుంచి బెల్లం లడ్డూల విక్రయాలు 
యాదాద్రి దేవస్థానంలో బుధవారం నుంచి బెల్లం లడ్డూల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈఓ గీతారెడ్డి తెలిపారు. లడ్డూ విషయంలో వారం రోజులుగా ట్రయల్‌రన్‌ చేసి నివేదికను దేవాదాయ శాఖ కమిషనర్‌కు పంపామన్నారు. వంద గ్రాముల లడ్డూ రూ.25గా ధర నిర్ణయించామన్నారు. ప్రసాదాల కౌం టర్ల ద్వారానే వీటిని విక్రయిస్తామన్నారు.  

మరిన్ని వార్తలు