ఆ అంశాలు ఏపీ మంత్రులకెందుకు?: జేపీ

30 Jun, 2015 04:35 IST|Sakshi
ఆ అంశాలు ఏపీ మంత్రులకెందుకు?: జేపీ

సాక్షి, హైదరాబాద్: సెక్షన్ 8ను హైదరాబాద్‌లో అమలు చేయాలని అడగాల్సింది ఇక్కడి ప్రజలు గానీ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్మమో, కర్ణాటక, తమిళనాడు ప్రభుత్వాలో కాదని, తమ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడుకోకుండా పొరుగు రాష్ట్రంలోని సమస్యలు ఏపీ మంత్రులకు ఎందుకని లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని ప్రజలు తమది ఆంధ్రానా.. తెలంగాణనా అన్న భేదాభిప్రాయాలు లేకుండా ప్రశాంతంగా ఉన్న సమయంలో పాలకులు సెక్షన్ 8 అంశాన్ని వివాదాస్పదం చేసి ఇక్కడి ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు.

హైదరాబాద్‌లో పార్టీ నేతలతో కలిసి సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సెక్షన్ 8 అన్నది కేవలం హైదరాబాద్‌లో ఇతర ప్రాంతాల ప్రజల శాంతిభద్రతలకు సంబంధించినది మాత్రమేనన్నారు. ప్రజలెనుకున్న ప్రభుత్వాలు ఉన్నప్పుడు గవర్నర్ అన్ని వ్యవహారాలలో తలదూర్చితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుందని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. గవర్నర్ వ్యవస్థ క్రమంగా లేకుండా పోవాలన్నది తన కోరికగా జయప్రకాష్ నారాయణ చెప్పారు.

మరిన్ని వార్తలు