జయరాం హత్యకేసు; కమెడియన్‌ కీలక పాత్ర!

14 Feb, 2019 20:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎన్నారై చిగురుపాటి జయరాం హత్యకేసులో కీలక మలుపులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడు రాకేష్‌ రెడ్డిని పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక లావాదేవీల కోసమే ఈ హత్య జరిగిందని అందరూ భావించినప్పటికీ.... రాకేష్‌ రెడ్డి  ఒక్క రూపాయి కూడా జయరామ్‌కి ఇవ్వలేదని పోలీసుల విచారణలో తేలింది. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయరాం మేనకోడలు శిఖా చౌదరిని గురువారం పోలీసులు విచారించారు. ఏసీపీ కార్యాలయంలో దాదాపు ఏడు గంటల పాటు శిఖాను ప్రశ్నించారు. శిఖా ఆర్థిక లావాదేవీలు, విలాసవంతమైన జీవితంపై ఆరా తీసినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా రాకేష్‌రెడ్డితో శిఖా పరిచయం, జయరాం భార్య పద్మశ్రీ చేసిన ఆరోపణలపై శిఖా చౌదరిని ప్రశ్నించినట్లు సమాచారం.

కాగా విచారణ అనంతరం శిఖా చౌదరి మీడియాతో మాట్లాడారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పినట్లు తెలిపారు. అవసరమైన సమయంలో మళ్లీ తప్పకుండా మీడియా ఎదుటకు వస్తానని, ప్రస్తుతం విచారణలో అడిగిన విషయాలు చెప్పలేనని పేర్కొన్నారు. అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని వ్యాఖ్యానించారు. ఇక జయరాం హత్యలో కమెడియన్‌ సూర్యప్రసాద్‌ అలియాస్‌ డుంబు కీలక పాత్ర పోషించినట్లుగా తెలుస్తోంది. మంచి అమ్మాయి ఉందంటూ అతడే జయరాంను రాకేష్‌ ఇంటికి తీసుకువెళ్లినట్లుగా సమాచారం. ఇక రాకేష్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న 30 మందిని పోలీసులు విచారించారు.

మరిన్ని వార్తలు