ఒక్కరోజు మహిళా కలెక్టర్‌

9 Mar, 2017 02:41 IST|Sakshi
ఒక్కరోజు మహిళా కలెక్టర్‌

జేసీ యాస్మిన్‌ బాషాకు దక్కిన అరుదైన గౌరవం
స్వయంగా సీట్లో కూర్చోబెట్టిన కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌


సాక్షి, సిరిసిల్ల: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా ప్రత్యేక గౌరవం పొందారు. జిల్లా కలెక్టర్‌ సీటులో ఆసీనులు కావడమే కాకుండా.. మహిళా దినోత్సవ బహిరంగ సభలోనూ కలెక్టర్‌గా కీర్తింపబడ్డారు. కలెక్టర్‌ హోదాలో పలు సమావేశాలు నిర్వహించారు. కలెక్టర్‌ లీవ్‌లో ఉన్న సమయంలో జేసీ ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టడం సర్వసాధారణమే అయినా.. కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ పక్కన ఉండగానే ఆమె కలెక్టర్‌గా సంబోంధింపబడడం విశేషం. మహిళా దినోత్సవం రోజున కలెక్టర్‌గా అధికారిక సంతకం చేయడం మినహా ఆమె బుధవారం ‘ఒక్కరోజు కలెక్టర్‌’గా వ్యవహరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

కలెక్టర్‌ సీటులో జేసీ..
ఉదయం కలెక్టరేట్‌లో జేసీ యాస్మిన్‌ను తన చాంబర్‌లోని కలెక్టర్‌ సీటులో కూర్చోబెట్టి కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ మహిళల పట్ల తనకున్న గౌరవం చాటుకున్నారు. ‘ఈరోజు మీరే కలెక్టర్‌’ అంటూ జేసీని తన సీటులో కూర్చోబెట్టి.. తాను అధికారుల సీట్లలో కూర్చొని మరోసారి తనదైన ప్రత్యేక శైలిని ప్రదర్శించారు. దాదాపు పావుగంటపాటు ఆమె కలెక్టర్‌ సీటులో, కలెక్టర్‌ అధికారుల సీటులో ఉండిపోయారు. అలాగే సభలో మాట్లాడుతున్న సమయంలో ‘ఇవాల్టి కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా’ అని జిల్లా కలెక్టర్‌ డి.కృష్ణభాస్కర్‌ సంబోధించడంతో సభికులు కరతాళ ధ్వనులు చేశారు. మిగతా అతిథులు కూడా యాస్మిన్‌ బాషాను కలెక్టర్‌గా ప్రస్తావించారు.

అధికారికంగా కుదరదని
కలెక్టర్‌గా మారిన యాస్మిన్‌ అదే హోదాలో పలు సమావేశాలు నిర్వహించారు. బీసీ కమిషన్‌ పర్యటన, అపరిష్కృతంగా ఉన్న అభివృద్ధి పనులు, తహసీల్దార్లతో సమావేశాలను కలెక్టర్‌ హోదాలో నిర్వహించి, పలు సూచనలు చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా జేసీ యాస్మిన్‌కు ఒక్కరోజు కలెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించడానికి ప్రయత్నాలు జరిగినప్పటికీ అధికారికంగా వీలుపడదని ఉన్నతాధికారులు చెప్పడంతో వెనక్కి తగ్గినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

మరిన్ని వార్తలు