ఈ నెల 14న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు

8 Jun, 2019 02:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ, ఎన్‌ఐటీల్లో సంయుక్త ప్రవేశాలకు 16 నుంచి చాయిస్‌ ఫిల్లింగ్‌

27న మొదటి దశ సీట్ల కేటాయింపు

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ఈ నెల 14న విడుదల చేసేందుకు ఐఐటీ (రూర్కీ) ఏర్పాట్లు చేస్తోంది. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారం పొందే సంస్థల్లో (జీఎఫ్‌టీఐ) ప్రవేశాలకు ఈ నెల 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌ను నిర్వహించేందుకు జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) కసరత్తు చేస్తోంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 19 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్‌  ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ 16 నుంచే చాయిస్‌ ఫిల్లింగ్‌ (వెబ్‌ ఆప్షన్లు) ప్రారంభిస్తామని, 27న మొదటి సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని ఎన్‌ఐటీ, ఐఐటీలకు జోసా తెలియజేసినట్లు సమాచారం.

దీనిపై అధికారికంగా ప్రకటన విడుదల చేయడంతో పాటు చాయిస్‌ ఫిల్లింగ్‌కు వెబ్‌సైట్‌ను త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తోంది. వచ్చే నెల 15 నాటికి ఏడు దశల కౌన్సెలింగ్‌ను నిర్వహించి ప్రవేశాలు పూర్తి చేసేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు చాయిస్‌ ఫిల్లింగ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వరంగల్‌ ఎన్‌ఐటీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వరంగల్‌ ఎన్‌ఐటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ ఎన్‌.వి. రమణరావు తెలిపారు.  

మరిన్ని వార్తలు