కాగితం ముక్క కూడా అనుమతించం!

5 Jan, 2020 03:18 IST|Sakshi

జేఈఈ మెయిన్‌ పరీక్షకు ఎన్‌టీఏ ఏర్పాట్లు పూర్తి

రేపటి నుంచి ఈనెల 11వ తేదీ వరకు నిర్వహణ

ప్రతి సబ్జెక్టులో 25 ప్రశ్నలకే పరీక్ష

అందులో 20 ప్రశ్నలు ఆబ్జెక్టివ్, న్యుమరికల్‌ వ్యాల్యూ ఐదు ప్రశ్నలు

న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నల్లో నో నెగెటివ్‌ మార్క్స్‌

సాక్షి, హైదరాబాద్‌: ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం ఈనెల 6వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జేఈఈ మెయిన్‌ పరీక్షలను ఆన్‌లైన్లో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇటీవల మార్పు చేసిన ప్రశ్నపత్రాలతో మొదటిసారిగా ఈ పరీక్షలను నిర్వహించబోతోంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పర్సు, పెన్ను, పెన్సిళ్లే కాదు.. కనీసం కాగితం ముక్క కూడా వెంట తీసుకురావద్దని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్‌ పరికరాలు, జామెట్రీ పరికరాలు, మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ పరికరాలేవీ వెంట తీసుకురావద్దని వెల్లడించింది.విద్యార్థులకు కావాల్సిన పెన్ను/పెన్సిల్, రఫ్‌ పేపరు పరీక్ష కేంద్రాల్లోనే అందజేస్తారు.

విద్యార్థులు నిర్ణీత సమయంకంటే ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, రిపోర్టింగ్‌ సమయం తరువాత గేట్‌ మూసివేశాక ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది ఉండదని వెల్లడించింది. ఈ పరీక్షలకు రాష్ట్రం నుంచి దాదాపు 75 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారికోసం తెలంగాణలోని హైదరాబాద్, సికింద్రాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ జిల్లా కేంద్రాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. విద్యార్థుల హాల్‌టికెట్లలో పేర్కొన్న గుర్తింపు కార్డుల్లో (ఆధార్, ఓటర్‌ ఐడీ, డ్రైవింగ్‌ లైసెన్స్, పాస్‌పోర్టు, ఫొటో కలిగిన ఇంటర్‌ పరీక్షల హాల్‌ టికెట్‌ తదితర) ఏదేని ఒక ఒరిజినల్‌ ఐడీ కార్డును, హాల్‌టికెట్‌ను తెచ్చుకోవాలి.

అరగంట ముందే చేరుకోవాలి
సోమవారం నుంచి 11వ తేదీ వరకు కంప్యూటర్‌ ఆధారితంగా  పరీక్ష నిర్వహించనుంది. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్ట్‌లుగా పరీక్షలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తోంది. మొదటి షిఫ్ట్‌ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, రెండో షిఫ్ట్‌ పరీక్ష మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయం త్రం 5:30 గంటల వరకు ఉంటుం ది. మొదటి షిఫ్ట్‌ పరీక్షకు ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటలలోపు, రెండో షిఫ్ట్‌ పరీక్షకు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గం టలలోపే పరీక్ష హాల్లోకి అనుమతిస్తా రు.ఈ పరీక్షల ఫలితాలను ఈనెల 31వ తేదీలోగా వెల్లడించనుంది.

75 ప్రశ్నలు.. 300 మార్కులు
ఇప్పటివరకు జేఈఈ మెయిన్‌లో 360 మార్కులకు 90 ప్రశ్నలు ఇచ్చేది. అవన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. వాటికి నెగటివ్‌ మార్కుల విధానం ఉంది. ఇప్పుడు మాత్రం 75 ప్రశ్నలతో 300 మార్కులకు పరీక్ష నిర్వహించబోతోంది. గణితంలో 25, ఫిజిక్స్‌లో 25, కెమిస్ట్రీలో 25 ప్రశ్నలు ఉంటాయి. ఆ మూడు సబ్జెక్టుల్లో 20 చొప్పున ప్రశ్నలకు ఆబ్జెక్టివ్‌ విధానంలో, 5 చొప్పున ప్రశ్నలను న్యూమరికల్‌ వ్యాల్యూ జవాబు వచ్చే ప్రశ్నలు ఇవ్వనుంది. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలకు మాత్రం నెగటివ్‌ మార్కుల విధానం ఉండదు. అయితే ఈసారి విద్యార్థుల స్కోరింగ్‌లో న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు కీలకం కానున్నాయి.

మరిన్ని వార్తలు