98 మార్కులకు కటాఫ్‌!

9 Apr, 2018 03:34 IST|Sakshi

ఈసారి పెరగనున్న జేఈఈ మెయిన్‌ కటాఫ్‌

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ పరీక్ష కటాఫ్‌ ఈసారి పెరిగే అవకాశం ఉంది. గతేడాదితో పోల్చితే ఈసారి కొంత సులభంగానే ప్రశ్నపత్రం వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. అయితే ఈసారి సుదీర్ఘ జవాబులు ఉన్న ప్రశ్నలు, కాలిక్యులేటెడ్‌ ప్రశ్నలు రావడంతో వాటిని రాసేందుకు తంటాలు పడాల్సి వచ్చిందని తెలిపారు. వాటి కారణంగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయలేని పరిస్థితి నెలకొందని చెప్పారు. గతే డాది కంటే సులభతర ప్రశ్నలు ఎక్కువగా ఉన్నందున ఈసారి జేఈఈ మెయిన్‌ కటాఫ్‌ పెరగనుందని సబ్జెక్టు నిపుణులు భావిస్తున్నారు.

మరోవైపు ఫిజిక్స్‌లో వచ్చిన ప్రశ్నలు కొంత తికమక పెట్టేలా ఉండటంతో విద్యార్థులు గందరగోళానికి గురయ్యారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంలో ఏర్పాటు చేసిన 115 పరీక్ష కేంద్రాల్లో ఆదివారం జేఈఈ మెయిన్‌ పరీక్షలు జరిగాయి. 74,580 మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 95 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు మూడు ప్రాంతాల్లోని కోఆర్డినేషన్‌ కేంద్రాల ప్రతినిధులు వెల్లడించారు. ఇక జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలను ఈ నెల 15, 16 తేదీల్లో సీబీఎస్‌ఈ నిర్వహించనుంది. ఈనెల 24న జవాబుల ‘కీ’లను ప్రకటించి, 27 వరకు అభ్యంతరాలను స్వీకరించనుంది. 30న మెయిన్‌ ఫలితాలను ప్రకటించి, 31న ఆలిం డియా ర్యాంకులను వెల్లడించనుంది. 

ఫిజిక్స్‌లో 4, మ్యాథ్స్‌లో 3, కెమిస్ట్రీలో 3.. 
ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ప్రభుత్వ ఆర్థిక సహకారం తో కొనసాగే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు, ఐఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు విద్యార్థులను ఎంపిక చేసేందుకు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) జేఈఈ మెయిన్‌ పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహించింది. ఇందులో 90 ప్రశ్నలకు పరీక్ష నిర్వహించింది. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లో 30 చొప్పున ప్రశ్నలు ఉండగా, ఒక్కో ప్రశ్నను 3 మార్కులకు నిర్వహించింది. ఫిజిక్స్‌లో 4 ప్రశ్నలు, మ్యాథ్స్, కెమిస్ట్రీలో మూడు చొప్పున కఠినతరమైన ప్రశ్నలు వచ్చినట్లు సబ్జెక్టు నిపుణులు రామకృష్ణ, ఎంఎన్‌రావు వెల్లడించారు. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో సుదీర్ఘ సమాధానాలు ఉన్న ప్రశ్నలు, కాలిక్యులేటెడ్‌ ప్రశ్నలు మరో 10కి పైగా ఉండటంతో విద్యార్థులు వాటిని చేసేందుకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వచ్చింది. దీంతో ప్రతిభావంతులైన విద్యా ర్థులు కాకుండా కొంత బాగా చదవగలిగే వారు వాటికి ఎక్కువ సమ యం తీసుకున్నారు. దీంతో అన్నింటికి సమాధానాలు రాయలేకపోయారు.

ఇక సాధారణ విద్యార్థులైతే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వచ్చింది. కాగా, ప్రశ్నల సరళి కారణంగా ఈసారి కటాఫ్‌ మార్కులు పెరగన్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి కటాఫ్‌ మార్కులు 15కు పైగా పెరిగే అవకాశ ముంది. గతేడాది జనరల్‌ కేటగిరీలో కటాఫ్‌ మార్కు లు 81 ఉండగా, ఈసారి 98పైనే ఉండనున్నాయి. గతేడాది కాకుండా అంతకుముందు సంవత్సరాల్లో కటాఫ్‌ మార్కులు ఎక్కువగా ఉండగా, గతేడాది తగ్గాయి. ఈసారి మళ్లీ కటాఫ్‌ మార్కులు పెరిగే అవకాశం ఉన్నట్లు సబ్జెక్టు నిపుణులు పేర్కొంటున్నారు. 

మరిన్ని వార్తలు