రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ 

6 Apr, 2019 02:16 IST|Sakshi

దేశవ్యాప్తంగా హాజరుకానున్న 9.34 లక్షల మంది 

రాష్ట్రం నుంచి 74 వేలమంది హాజరు 

7న బీఆర్క్‌ కోసం.. 8, 9, 10,12 తేదీల్లో బీటెక్‌ కోసం పరీక్ష 

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీల్లో ప్రవేశాల కోసం ఈ నెల 7 నుంచి జేఈఈ మెయిన్‌–2 పరీక్షలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 7న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ (బీఆర్క్‌) కోర్సులో ప్రవేశాలకు ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. 8, 9, 10, 12 తేదీల్లో బీఈ/బీటెక్‌లో ప్రవేశాల కోసం ప్రవేశ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా 9.34 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

ఈ పరీక్ష నిర్వహణ కోసం రాష్ట్రంలోని హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, వరంగల్, కోదాడ, నిజామాబాద్‌ పట్టణాల్లో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత జనవరిలో జరిగిన జేఈఈ మెయిన్‌–1 పరీక్షలకు దేశవ్యాప్తంగా 9,29,198 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా, 8,74,469 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. జేఈఈ మెయిన్‌–2 పరీక్షలకు 9.34 లక్షల మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. అందులో కొత్తవారు 3.14 లక్షల మంది ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం నుంచి దాదాపు 74 వేల మంది పరీక్షకు హాజరుకానున్నారు. 

రెండు దశల్లో నిర్వహణ.. 
ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ ఏడాది నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షను రెండు దశలుగా ఎన్‌టీఏ నిర్వహిస్తోంది. రెండు విడతల పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ ప్రకారం ర్యాంకులు కేటాయించనుంది. దీంతో జనవరిలో పరీక్షలు రాసినవారు స్కోర్‌ పెంచుకోవడానికి ఏప్రిల్‌ పరీక్షలకు హాజరవుతున్నారు. మొదటి విడత పరీక్షల్లో 8,816మంది విద్యార్థులు 99–100 పర్సంటైల్‌ సాధించినట్లు సమాచారం. 

ఇదీ పరీక్ష షెడ్యూల్‌.. 
ఆన్‌లైన్‌లో పరీక్షలను రోజూ రెండు షిఫ్ట్‌లుగా నిర్వహించనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటలకు మొదటి షిఫ్ట్‌ పరీక్ష నిర్వహించనుండగా, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్ట్‌ పరీక్ష నిర్వహించనుంది. విద్యార్థులను రెండు గంటల ముందు నుంచే పరీక్ష కేంద్రంలోకి అనుమతించనుంది. విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లాల్సిందే. ఉదయం పరీక్షకు 8.30 గంటలలోపు, మధ్యాహ్నం పరీక్షకు 1.30 గంటలలోపు విద్యార్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లేలా అనుమతిస్తారు. పరీక్ష హాలులోకి మాత్రం ఉదయం 8.45 గంటల నుంచి 9 గంటల వరకే అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 1.45 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్ష హాలులోకి అనుమతిస్తారు.  

మరిన్ని వార్తలు