ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ పరీక్షలు

9 Jan, 2019 01:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ, ఐఐటీ, ఇతర జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ పరీక్షలు మంగళవారం ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొదటిరోజు ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ పేపరు–2 పరీక్షకు విద్యార్థులు హాజరయ్యారు. దేశ వ్యాప్తంగా ఈ పరీక్షకు 1.82 లక్షల మంది హాజరు కాగా, తెలంగాణ నుంచి దాదాపు 20 వేల మంది విద్యార్థులు హాజరైనట్లు అంచనా. మరోవైపు బీటెక్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్‌ పేపరు–1 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్‌ పట్టణాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఈ పరీక్షలు జరుగనున్నాయి. వీటికి దేశవ్యాప్తంగా 9.65 లక్షల మంది హాజరుకానుండగా, తెలంగాణ నుంచి దాదాపు 70 వేల మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు అంచనా.

కాలేజీలు తగ్గినా సీట్ల పెరుగుదల
గత ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్‌–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరిగాయి. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 3,688 కాలేజీల్లోని వివిధ కోర్సుల్లో 5,23,291 సీట్లు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరం వచ్చేసరికి కాలేజీల సంఖ్య 2,901కి తగ్గిపోయింది. అయితే సీట్ల సంఖ్య మాత్రం 6,52,178కి పెరిగింది. అంటే ఐదేళ్లలో 787 కాలేజీలు తగ్గినా 1,28,887 సీట్లు పెరిగాయి. ఇందులో అత్యధికంగా డిగ్రీలో సీట్లు పెరిగాయి. ఇతర కోర్సుల్లోనూ సీట్లు, కాలేజీలు తగ్గిపోయాయి. డిగ్రీ కాలేజీల సంఖ్య గత ఐదేళ్లలో తగ్గినా సీట్ల సంఖ్య 2 లక్షలు పెరి గింది. అయినా ప్రవేశాలు మాత్రం ఆశించిన మేర పెరగలేదు. ఎంటెక్, ఎం.ఫార్మసీలో మాత్రం కాలేజీలు, సీట్ల సంఖ్య భారీగా తగ్గింది. 

మరిన్ని వార్తలు