జేఈఈ అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ 87.71

31 Jan, 2019 02:28 IST|Sakshi

జనవరిలో జేఈఈ రాసిన విద్యార్థుల సంఖ్య మేరకు అంచనా!

ఏప్రిల్‌లో జేఈఈ తర్వాత 88.43కు పెరిగే అవకాశం

పరీక్షకు హాజరయ్యే వారి సంఖ్యతో మారనున్న ఓపెన్‌ కేటగిరీ కటాఫ్‌  

సాక్షి, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ స్కోర్‌ను మార్కుల రూపంలో కాకుండా పర్సంటైల్‌ విధానంలో ఇచ్చినప్పటికీ జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఎంపికయ్యే వారి సంఖ్యను లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హులుగా పరిగణనలోకి తీసుకునే వారి కటాఫ్‌ ఓపెన్‌ కేటగిరీలో 87.71 ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నెల 8 నుంచి 12 వరకు జరిగిన జేఈఈ మెయిన్‌ స్కోర్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ నెల 19న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అందులో పర్సంటైల్‌ ఇవ్వడంతో కొందరు విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ కటాఫ్‌ ఎంత ఉండవచ్చన్న అనుమానాల్లో పడ్డారు. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరమే లేదని, పర్సంటైల్‌ విధానం ప్రకారం అడ్వాన్స్‌డ్‌కు కటాఫ్‌ లెక్కించుకోవచ్చని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. జనవరిలో జరిగిన పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్య మేరకు ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌ 87.71 ఉండే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఏప్రిల్‌లో రెండోదఫా జేఈఈ మెయిన్‌ పరీక్ష ఉన్నందున దానికి హాజరయ్యే విద్యార్థుల సంఖ్య బట్టి కటాఫ్‌ లో మార్పులు ఉంటాయి. అప్పుడే కటాఫ్‌ పర్సంటైల్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించనుంది. 

ఓపెన్‌ కేటగిరీ కటాఫ్‌ లెక్కింపు ఇలా.. 
సాధారణంగా అన్ని కేటగిరీల్లో కలిపి 2.24 లక్షల మంది విద్యార్థులను జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటారు. గతంలో సమాన మార్కులు వచ్చిన విద్యార్థులను అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకోవడంతో మరో 7 వేలు పెరిగి 2.31 లక్షలకు చేరుకుంది. ఈసారి మాత్రం టాప్‌ 2.24 లక్షల మందినే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రకారం 50.5 శాతం విద్యార్థులను ఓపెన్‌ కేటగిరీలో తీసుకోవాలి. దీంతో ఓపెన్‌ కేటగిరీలో ఎంపిక చేసే విద్యార్థుల సంఖ్య 1,13,120 అవుతుంది. అందులో దివ్యాంగులను 5 శాతం మినహాయిస్తే 1,07,464 మందిని ఓపెన్‌ కేటగిరీలో అడ్వాన్స్‌డ్‌కు ఎంపిక చేస్తారు. జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షకు మొత్తం 8,74,469 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇందులో అడ్వాన్స్‌డ్‌కు ఓపెన్‌ కేటగిరీలో పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల శాతం 12.2890577 అవుతుంది. జనవరి పరీక్షలో టాప్‌ పర్సంటైల్‌ 100.0000000. అందులో నుంచి ఓపెన్‌ కేటగిరీ విద్యార్థుల పర్సంటేజీని తీసేస్తే 87.7109423 పర్సంటైల్‌ వస్తుందని, ఓపెన్‌ కేటగిరీలో కటాఫ్‌గా ఉండే పర్సంటైల్‌ అదే అయ్యే అవకాశం ఉందని జేఈఈ నిపుణులు సురేష్‌కుమార్‌ వివరించారు.

ఇది పూర్తిగా జనవరి పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య మేరకేనని పేర్కొన్నారు. వాస్తవానికి జనవరిలో జరిగే జేఈఈ మెయిన్‌కు హాజరయ్యేందుకు దరఖాస్తు చేసుకున్న వారిలో 54,729 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదు. అంటే వారంతా ఏప్రిల్‌లో జరిగే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. దీంతో ప్రస్తుతం రాసిన వారు, పరీక్ష రాయని వారు కలుపుకుని విద్యార్థుల సంఖ్య 9,29,198కి చేరే అవకాశం ఉంది. ఈ విద్యార్థుల సంఖ్య ప్రకారం చూస్తే ఓపెన్‌ కేటగిరీ విద్యార్థుల సంఖ్య (దివ్యాంగులు కాకుండా) 1,07,464 మంది. దీన్ని పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల సంఖ్యతో చూస్తే 11.56524228 శాతం. టాప్‌ పర్సంటైల్‌ 100 అయినందున అందులో నుంచి 11.56524228ని తీసివేస్తే 88.4347577 వస్తుంది. అదే ఓపెన్‌ కేటగిరీ కటాఫ్‌ అవుతుంది. ఏప్రిల్‌లో పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను బట్టి ఇది మారనుంది. ఐఐటీల్లో సీట్లు పెరిగితే మాత్రం అడ్వాన్స్‌డ్‌కు పరిగణనలోకి తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు కటాఫ్‌ కూడా భారీగా తగ్గే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. 

పర్సంటైల్‌ ఆధారంగా ర్యాంకు
విద్యార్థులకు వచ్చిన పర్సంటైల్‌ ఆధారంగా ర్యాంకు లెక్కించుకోవడం సులభమేనని నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు 93.9274506 పర్సంటైల్‌ విద్యార్థిని తీసుకుంటే.. టాప్‌ 100 పర్సంటైల్‌ నుంచి ఈ విద్యార్థి పర్సంటైల్‌ తీసివేస్తే అతనికి వచ్చేది 6.0725494. అంటే ప్రతి 100 మంది విద్యార్థుల్లో అతని ర్యాంకు 6.0725494 అన్నమాట. ఆ లెక్కన పరీక్షకు హాజరైన మొత్తం 8,74,469 మంది విద్యార్థుల్లో చూస్తే అతనికి వచ్చే ర్యాంకు 53102.562012686. అయితే జనవరిలో జరిగిన జేఈఈ పరీక్షను 8 దఫాలుగా నిర్వహించినందున అతని ర్యాంకులో 8 స్థానాలు అటూ ఇటుగా మారే అవకాశం ఉంటుంది. మరోవైపు 100 పర్సంటైల్‌ వచ్చి న విద్యార్థులు అందరికీ ఒకే ర్యాంకు ఇవ్వరు.

వారికి ర్యాంకులను కేటాయించే సమయంలో విద్యార్థి మొత్తం మార్కులను చూస్తారు. పలువురు విద్యార్థులకు సమాన మార్కులు ఉంటే.. వరుసగా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో వరుసగా చూసి ఎక్కువ మార్కులు వచ్చిన వారికి ముందు ర్యాంకులను కేటాయిస్తారు. ఆ మార్కులు సమానంగా ఉంటే ఎక్కువ వయసు వారికి ముందు ర్యాంకును కేటాయించి, మిగతా వారికి వరుసగా కిందకు ర్యాంకులను కేటాయిస్తారు. అయితే ఈ ర్యాంకులను విద్యార్థులకు ఇప్పుడే ఇవ్వరు. ఏప్రిల్‌లో జరిగే పరీక్ష తర్వాతే 2 దఫాల్లో జేఈఈ మెయిన్‌కు హాజరైన విద్యార్థులను, వారికి వచ్చిన పర్సంటైల్‌ను తీసుకొని ర్యాంకులను కేటాయిస్తారు. వాటి ఆధారంగానే ఐఐటీల్లో ప్రవేశాలు చేపడతారు.

మరిన్ని వార్తలు