సంక్షేమ పథకాలే గెలిపిస్తాయి.. ఆశన్నగారి జీవన్‌రెడ్డి

29 Nov, 2018 16:34 IST|Sakshi

మునుపెన్నడూ లేని అభివృద్ధి సాధించాం

ఇంటర్వ్యూలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి

సాక్షి, ఆర్మూర్‌: ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ నాయకత్వంలో కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడానికి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆశన్నగారి జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తాజా మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిని ‘సాక్షి’ స్పెషల్‌ ఇంటర్వ్యూ నిర్వహించగా నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు.

ప్రశ్న: నియోజకవర్గంలో మీ హయాంలో అభివృద్ధి ఎంత వరకు సాధించారు?
జవాబు: సమైక్య పాలకుల నిర్లక్ష్యానికి గురైన నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత సహకారంతో నాలుగున్నరేళ్ల కాలంలో 2,500 కోట్ల రూపాయలకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాం. 

ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమిటి?
జ: వృద్ధులు, వితంతులు, వికలాంగులు, ఒంటరి మహిళలు 52 వేల మంది లబ్ధిదారులకు పింఛన్ల రూపంలో నెలకు ఐదు కోట్ల 91 లక్షల రూపాయల చొప్పున నాలుగున్నరేళ్లలో 250 కోట్లు చెల్లించాం. బీడీ కార్మికులకు జీవన భృతిని అందజేస్తున్నాం. 3,500 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ రూపంలో రూ.24 కోట్లు, 3,540 మంది యాదవులకు రూ.32 కోట్లతో గొర్రెలు పంపిణీ చేశాం.

ప్ర: నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమిటి?
జ: మిషన్‌ కాకతీయలో భాగంగా 148 చెరువులకు రూ.51 కోట్లతో మరమ్మతులు చేపట్టి 14,350 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ చేశాం. నిజాంసాగర్‌ కాలువల మరమ్మతులకు రూ.38 కోట్లు, ఎత్తిపోతల పథకాలకు రూ.15 కోట్లు, అర్గుల్‌ రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకం మరమ్మతులకు రూ.105 కోట్లు, గుత్ప, అలీసాగర్‌ ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రూ.148 కోట్లు, గుత్ప ఎత్తిపోతల పథకం విస్తరణకు రూ.23 కోట్లు మంజూరు చేశాం. రూ.404 కోట్లతో మిషన్‌ భగీరథ పనులు కొనసాగుతున్నాయి.

ప్ర: ప్రస్తుత ఎన్నికల్లో ఇస్తున్న హామీలు ఏమిటి?
జ: ఆర్మూర్‌ను ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం పని చేస్తున్నా. అందులో భాగంగా టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో పొందుపర్చిన ప్రతీ హామీని నెరవేరుస్తాం.

ప్ర: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?
జ: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలతో గ్రామాల్లోని ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్తే అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్నారు. 2014లో జరిగిన ఎన్నికలు తెలంగాణ సెంటిమెంట్‌ను ఆధారం చేసుకొని జరిగితే ప్రస్తుత ఎన్నికలు సంక్షేమ, అభివృద్ధి పథకాలే కేంద్రంగా సాగుతున్నాయి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే మమ్మల్ని గెలిపించనున్నాయి.  

నందిపేట మండలంలోని లక్కంపల్లి సెజ్‌ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం నుంచి రూ.109 కోట్లు, నిజామాబాద్‌ నుంచి ఆర్మూర్‌ జాతీయ రహదారి అభివృద్ధికి వంద కోట్ల రూపాయలు, లెదర్‌ పార్క్‌ అభివృద్ధికి రూ.పది కోట్లు మంజూరు చేయించాం. 24 గంటల విద్యుత్‌ సరఫరా కోసం 13 కొత్త సబ్‌ స్టేషన్ల నిర్మాణానికి రూ.15 కోట్లు మంజూరు చేయించాం. 12,500 మెట్రిక్‌ టన్నుల కెపాసిటీ గల గోదాముల నిర్మాణానికి రూ.ఏడు కోట్లు, 40 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి రూ.ఆరు కోట్లు, రెసిడెన్షియల్‌ స్కూల్స్, కళాశాలల నిర్మాణానికి రూ.117 కోట్లు, ఉమ్మెడ వద్ద గోదావరిపై బ్రిడ్జి నిర్మాణానికి రూ.110 కోట్లు, ఆర్‌ అండ్‌ బీ రోడ్ల అభివృద్ధికి 144 కోట్లు, రూ.33 కోట్లతో సీసీ రోడ్లు, రూ.8.4 కోట్లతో శ్మశాన వాటికల అభివృద్ధి పనులు చేపట్టాం. సిద్ధుల గుట్ట అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశాం. ఆలూర్, నందిపేట బైపాస్‌ రోడ్ల నిర్మాణం పూర్తి చేయించా. 
 

మరిన్ని వార్తలు