పరిశ్రమలతో ఎంవోయూ తప్పనిసరి

26 Feb, 2020 02:21 IST|Sakshi

8 కొత్త కోర్సుల్లో ప్రవేశాలకు అనుబంధ గుర్తింపు

సీట్లు పెంచకుండా, కోర్సుల మార్పునకే అవకాశం

నేటి నుంచి అనుబంధ గుర్తింపునకు దరఖాస్తులు

వచ్చే నెల 16 నుంచి ఎఫ్‌ఎఫ్‌సీ తనిఖీలు

స్పష్టం చేసిన జేఎన్‌టీయూ

సాక్షి, హైదరాబాద్‌: విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించేలా రాష్ట్రంలోని ప్రతి ఇంజనీరింగ్‌ కాలేజీ కనీసం 5 పరిశ్రమలతో ఒప్పందాలు చేసుకొని విద్యార్థులను భాగస్వామ్యం చేయాలని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది. ఉద్యోగ,ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్న, మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న 8 కొత్త కోర్సులను 2020–21 విద్యా సంవత్సరంలో జేఎన్‌టీయూ పరిధిలోని ఇంజనీరింగ్‌ కాలేజీల్లో నిర్వహించేందుకు అనుబంధ గుర్తింపు ఇస్తామని జేఎన్‌టీయూ స్పష్టం చేసింది. అయితే ప్రస్తుతం ఉన్న సీట్లు (ఇన్‌టేక్‌) పెరగకుండా, ఉన్న సీట్లలోనే కోర్సులు బదలాయించుకోవచ్చని (కన్వర్షన్‌) వెల్లడించింది. అదనపు సీట్లను ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. సైబర్‌ సెక్యూరిటీ, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, నెట్‌ వర్కింగ్, మిషన్‌ లెర్నింగ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), రొబోటిక్స్, త్రీడీ ప్రింటింగ్‌ వంటి కోర్సులకు అనుబంధ గుర్తింపు ఇస్తామని పేర్కొంది.

ఈ నెల 26 నుంచి యాజమాన్యాలు అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, మార్చి 10 వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని స్పష్టం చేసింది. మార్చి 11 నుంచి మార్చి 16 వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించారు. మార్చి 16 నుంచి దరఖాస్తు చేసుకున్న కాలేజీల్లో సదుపాయాలు, ఫ్యాకల్టీ పరిశీలన కోసం ఫ్యాక్ట్‌ ఫైండింగ్‌ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేస్తామని తెలిపారు. జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు ప్రాసెస్‌పై కాలేజీల యాజమాన్యాలతో మంగళవారం జేఎన్‌టీయూ సమావేశం నిర్వహించింది. 2020–21 విద్యా ఏడాదిలో తాము అమలు చేయబోయే విధానాలను తెలియజేయడంతో పాటు యాజమాన్యాల నుంచి సలహాలు, సూచనలు ఈ సందర్భంగా స్వీకరించింది. కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ జయేశ్‌ రంజన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఏఐసీటీఈ అనుమతిస్తేనే మేం ఇస్తాం
రాష్ట్రంలో భవన నిర్మాణ అనుమతులు, ల్యాండ్‌ కన్వర్షన్‌లో సమస్యలు ఉన్న 238 కాలేజీల్లో 154 కాలేజీలు జేఎన్‌టీయూ పరిధిలోనే ఉన్నాయని జేఎన్‌టీయూ పేర్కొంది. అందులో 79 కాలేజీలు తమ లోపాలకు సంబంధించిన వివరణలతో కూడిన నివేదికలు అందజేశాయని పేర్కొంది. ఇంకా 75 కాలేజీలు వివరణలతో కూడిన నివేదికలు ఇవ్వలేదని, తాము ఎన్నిసార్లు నోటీసులిచ్చినా పట్టించుకోవట్లేదని పేర్కొంది. అయితే ఈ కాలేజీల విషయంలో తాము ఏం చేయలేమని, ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తేనే తాము అనుబంధ గుర్తింపు ఇస్తామని, ఏఐసీటీఈ ఇవ్వకపోతే తాము అనుబంధ గుర్తింపు ఇచ్చేది లేదని స్పష్టం చేసింది. బీటెక్, బీ–పార్మసీ విద్యార్థులకు 2020–21 విద్యా సంవత్సరం నుంచి బయోమెట్రిక్‌ హాజరు విధానం అమలు చేయాల్సిందేనని స్పష్టం చేసింది.

మూడు రోజుల్లో గవర్నింగ్‌ బాడీల నామినీలు
ప్రతి కాలేజీ గవర్నింగ్‌ బాడీలు ఏర్పాటు చేయాల్సిందేనని, సమావేశాలను రెగ్యులర్‌గా నిర్వహించాలని యాజమాన్యాలకు జేఎన్‌టీయూ స్పష్టం చేసింది. జేఎన్‌టీయూ నామినీలను 3 రోజుల్లో ఇస్తామని పేర్కొంది. కెరీర్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీం కింద కాలేజీల్లో పదోన్నతులు ఇచ్చుకోవచ్చని, వాటిని యూనివర్సిటీలో ర్యాటిఫై చేయించుకోవాలని తెలిపింది.  కాలేజీలు పక్కాగా మూడు వారాల ఇండక్షన్‌ ప్రోగ్రాం అమలు చేయాల్సిందేనని సూచించింది. వరుసగా మూడేళ్లు 25% కంటే ప్రవేశాలు తక్కువగా ఉంటే ఆ కోర్సును అమలు చేసేందుకు అనుమతి ఇవ్వబోమని పేర్కొంది.

అన్ని కోర్సులు ఇవ్వాలి: ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు
ఉద్యోగ అవకాశాలున్న 10 రకాల కొత్త కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపిందని, అందులో 8 కోర్సులకే అనుమతిస్తామని జేఎన్‌టీయూ పేర్కొనడం సరికాదని ఇంజనీరింగ్‌ కాలేజీ యాజమాన్యాల సంఘం అధ్యక్షుడు గౌతంరావు పేర్కొన్నారు. ఏఐసీటీఈ ఆమోదించిన అన్ని కోర్సులకు సిలబస్‌ రూపొందించి జేఎన్‌టీయూ అనుబంధ గుర్తింపు ఇవ్వాలని కోరారు.

మరిన్ని వార్తలు