ప్రభుత్వ విద్యార్థులకు జేఎన్టీయూ నోట్‌బుక్స్‌

14 Jun, 2018 03:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ఉచిత నోటుబుక్స్‌ ను జేఎన్టీయూహెచ్‌ (జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, హైదరాబాద్‌) పంపిణీ చేయనుంది. తమ ఎన్‌ఎస్‌ఎస్‌ విభాగం ద్వారా సుమారు లక్ష నోట్‌బుక్స్‌ పంపిణీకి ఏర్పాట్లు చేసింది. వర్సిటీ నిర్వహించే సెమిస్టర్‌  పరీక్షలకు హాజరైన వారి జవాబు పత్రాలు, గైర్హాజరైన వారి జవాబు పత్రాలను మూల్యాంకనం తర్వాత ధ్వంసం చేసేవారు. ఈ ఏడాది అందుకు భిన్నంగా జవాబు పత్రాలు వృథా కాకూడదనే ఉద్ధేశంతో వర్సిటీ అధికారులు ప్రణాళిక రూపొందించారు. మూడేళ్లుగా గైర్హాజరైన వారి జవాబు పత్రాలతో తయారు చేసిన లక్ష నోటు పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ర్థులకు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పుస్తకాల్లో టెన్త్‌ తర్వాత విద్యార్థులకు దిశానిర్దేశం చేసే సమాచారం, వర్సిటీ నిర్వహిస్తోన్న సాంకేతిక విద్యా విభాగాల సమాచారం పొందుపరిచినట్లు జేఎన్టీయూహెచ్‌ తెలిపింది.

రెండేళ్ల నిబంధనను పట్టించుకోవటం లేదు
సాక్షి, హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల బోధన సిబ్బం ది బదిలీల్లో ఉన్నతాధికారులు ‘రెండేళ్ల’ నిబంధనలను పట్టించుకోవటం లేదని టీచర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల సొసైటీ పరిధిలో టీచర్ల బదిలీల కౌన్సెలింగ్‌ సోమవారం ప్రారంభమైంది. సోమవారం జోన్‌ 5, జోన్‌ 6 పరిధిలోని ప్రిన్సిపాళ్ల ట్రాన్స్‌ఫర్‌ కౌన్సెలింగ్‌ నిర్వహించగా... మంగళవారం జోన్‌ 5 పరిధిలోని టీచర్లకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఇందులో ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసిన ప్రిన్సిపా ళ్లు, టీచర్లకు మాత్రమే అవకాశం కల్పించారంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకేచోట రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగి బదిలీకి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వం పేర్కొన్నా, ఎస్సీ గురుకుల సొసైటీలో ఐదేళ్లు నిండిన వారికే అవకాశం కల్పించారని వారు ఆరోపిస్తున్నారు.  గురువారం జోన్‌ 6 పరిధిలోని టీచర్లకు కౌన్సెలింగ్‌ జరుగనుంది. 

>
మరిన్ని వార్తలు