మీ డాక్టరేట్లను  రుజువు చేసుకోండి

30 Sep, 2019 02:37 IST|Sakshi

నకిలీ అధ్యాపకులను తొలగించేందుకు జేఎన్టీయూహెచ్‌ చర్యలు

సాక్షి, హైదరాబాద్‌: మీ డాక్టరేట్లు (పీహెచ్‌డీలు) ప్రామాణికమైనవైతే తగు రుజువులు చూపి వాటిని నిరూపించుకోవాలని జేఎన్టీయూహెచ్‌ తన అనుబంధ కళాశాలల ప్రొఫెసర్లకు ఆదేశాలు జారీచేసింది.వర్సిటీ అనుబంధ కళాశాలల్లో తప్పుడు పీహెచ్‌డీలతో లేదా సంబంధిత పట్టాపత్రాలు లేకున్నా కొందరు హెచ్‌వోడీలుగా, అధ్యాపకులుగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వారికి చెక్‌ పెట్టడంతో పాటు, ఉన్నవారి పనితీరు సమీక్షించేందుకు చర్యలు ప్రారంభించింది. 

నిజమని తేల్చిన తరువాతే.. 
దీనిలో భాగంగా జేఎన్టీయూహెచ్‌ అనుబంధ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు వారి విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలను అందించడం తోపాటు, వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న పీహెచ్‌డీ పట్టా కలిగిన అధ్యాపక సభ్యులు తమ డిగ్రీలు నిజమైనవని నిరూపించుకోవాలి, అలాగే తమ పనితీరు మూల్యాంకనం కోసం సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ముందు హాజరుకావాలి. కమిటీ సభ్యులు అధ్యాపకుల పీహెచ్‌డీ డిగ్రీ నిజమైనదా కాదా తేల్చాల్సి ఉంది. అలా ధ్రువీకరణ పొందాకనే వాటిని ఫ్యాకల్టీ పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయడానికి అనుమతిస్తారు.  

ప్రిన్సిపాళ్లదే బాధ్యత.. 
పీహెచ్‌డీ, ఫ్యాకల్టీల పత్రాలను వర్సిటీకి పంపించే బాధ్యతను అను బంధ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కమిటీ అప్పగించింది. వీటిని అక్టోబర్‌ 19లోగా పంపాలి. దీనికోసం పీహెచ్‌డీలు గల అధ్యాపకులు తమ పీహెచ్‌డీ పత్రాల హార్డ్‌ కాపీలతోపాటు వర్సిటీల నుంచి పొందిన సర్టి ఫికెట్‌లను సమర్పించాలి. పరిశీలించిన తర్వాత వీటిని వర్సిటీకి ప్రిన్సిపాళ్లు పంపించాలని జేఎన్టీయూహెచ్‌ రిజిస్ట్రార్‌ యాదయ్య తెలిపారు.  

నకిలీ అధ్యాపకులకు చెక్‌:పీహెచ్‌డీ ఉన్న అధ్యాపకులు హార్డ్‌ కాపీలను గడువులోగా వర్సిటీకి సమర్పించడంలో విఫలమైతే, వాటిని పరిగణనలోకి తీసుకోరు. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, ఫార్మసీ కళాశాల ల్లో నకిలీ అధ్యాపకులను తొలగించటానికి ఇది తోడ్పడనుంది. యూజీసీ నిబంధనల ప్రకారం 10% మంది అధ్యాపకులకు పీహెచ్‌డీ హోదా ఉంటేనే ఆ కళాశాలకు అక్రిడేషన్‌ వస్తుంది. దీంతో కళాశాలలు పీహెచ్‌డీ ఉన్న వారినే నియమించుకోవటానికి అవకాశం ఉంటుంది.

మరిన్ని వార్తలు