ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

1 Jun, 2015 01:55 IST|Sakshi
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి

లేకుంటే సచివాలయం ముట్టడిస్తాం: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావని  ఉద్యమంలో  ఉపన్యాసాలు ఇచ్చి తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క ఉద్యోగానికీ  నోటిఫికేషన్ ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు.  తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షలు, ఏపీలో లక్షన్నర ఉద్యోగాలకు జూన్ 2లోగా ఆయా ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే లక్షమంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.

నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలవెంకట్ అధ్యక్షతన ఆదివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని అన్నపూర్ణ కల్యాణమండపంలో సమావేశం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులనుద్దేశించి  కృష్ణయ్య మాట్లాడారు. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంతో అనేక మంది నిరుద్యోగుల వయోపరిమితి దాటి పోయి నష్టపోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నెలలోపు లక్ష, 6నెలల్లో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని  వాగ్దానం చేసి అసెంబ్లీలో కూడా ప్రకటించి ఏడాదైనా ఎటువంటి స్పందనలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు.
 
బతుకునిచ్చే తెలంగాణ కావాలే: విమలక్క
అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరి అయ్య జాగీరు కాదనీ అరుణోదయ కళామండలి అధ్యక్షురాలు, ప్రజాగాయని విమలక్క అన్నారు. మిలియనీర్లను బ్రాండ్ అంబాసిడర్‌లుగా చేయటం కాదనీ రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలు కోరుకునేది బంగారు తెలంగాణ కాదని బతుకునిచ్చే తెలంగాణ అని  అన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, శారద,  దుర్గయ్యగౌడ్  తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు