కొలువులుఇస్తారా!

8 Nov, 2014 02:44 IST|Sakshi
కొలువులుఇస్తారా!

ప్రగతినగర్ : ప్రభుత్వ శాఖలలో త్వరలో ఔట్‌సోర్సింగ్ విధానంలో వెయ్యి పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ రొనాల్డ్ రోస్ ఉద్యోగ ఏజెన్సీలు వేసిన టెండర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అర్హతలేని ఏజెన్సీలు సైతం టెండర్లలో పాల్గొన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్ 29న నోటిఫికేషన్ వేయగా 27 ఏజెన్సీ లు టెండర్లు దాఖలు చేశాయి.

సీల్డు టెండర్లను గతనెల 20న అదనపు జాయింట్ కలెక్టర్ శేషాద్రి ఏజెన్సీ నిర్వాహకుల సమక్షంలో తెరిచారు. కాగా కొన్ని ఏజెన్సీలు బినామీ పత్రాలు దాఖలు చేసి టెండర్ లో పాల్గొన్నట్లు అధికారులు గుర్తించారు. బ్లాక్‌లిస్టులో ఉన్న ఏజెన్సీలు, క్రిమినల్ కేసులు నమోదైనవారు, ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లింపులు జమచేయని, సరైన ధ్రువపత్రాలు లేని ఏజెన్సీలు టెండర్‌లు వేసినట్లు తెలుస్తోంది.

 తీవ్ర పోటీ
 ఒకేసారి వెయ్యి పోస్టుల నియామకాలు జరుపుతుండడంతో ఏజెన్సీల మధ్య పోటీ తీవ్రమైంది. ఈసారి గతంలో కంటే ఎక్కువ ఏజెన్సీలు టెండర్ దాఖలు చేశాయి. మొత్తం 33 మంది ఏజెన్సీ నిర్వాహకులు దరఖాస్తులు తీసుకువెళ్లగా 27 మంది ఈఎండీ చెల్లించి టెండర్‌లో పాల్గొన్నారు. వీరిలో ప్రస్తుతం జిల్లాలోని కొన్ని శాఖల్లో ఔట్ సోర్సింగ్ నడుపుతున్న ఏజెన్సీ నిర్వాహకులతో పాటు కొత్తవారు ఉన్నారు. ఈనెల 20న అదనపు జేసీ శేషాద్రి తన చాంబర్‌లో టెండర్‌దారుల సమక్షంలో బాక్స్ ఓపెన్ చేసి ఏజెన్సీలు నమోదు చేసిన ‘కోట్’ను చదివి విని పించారు.

వాస్తవానికి ఏజెన్సీల ఎంపికలో తక్కువ కోట్‌తో సంబంధం లేకుండా ఏజెన్సీలకు ఉన్న అర్హతలు, అనుభవం, ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లింపులు, పరిగణనలోకి తీసుకోవాలి.  ప్రభుత్వానికి టీడీఎస్ (టాక్స్ డిడ క్షన్ సోర్స్) 2.64 శాతం చెల్లించిన అర్హత కూడా ఉండాలి. ఈ ప్రకారం టెండర్ వేసిన 27 ఏజెన్సీల అర్హతలు అదే రోజు రాత్రి పదిగంట వరకు అధికారులు పరిశీలించారు.

 బినామీ పత్రాలు సమర్పించి
 వీటిలో కొన్ని ఏజెన్సీలు బినామీ అర్హత పత్రాలు సమర్పించినట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ముందు తక్కువ కోట్ చేసిన ఏజెన్సీల ఒరిజినల్ అర్హత పత్రాలు పరిశీలించాలని అసిస్టెంట్ లేబర్ కమిషనర్  శ్యాంసుందర్, ఉపాధి కల్పానాధికారి మోహన్‌లాల్‌ను కలెక్టర్ ఆదేశించారు.

 ఏజెన్సీల ఎంపికలో ఎక్కడ కూడ నిబంధనలు ఉల్లంఘించకుండా అర్హత కలిగిన పది ఏజెన్సీలను ముందు గుర్తించి ఫైల్ తనదగ్గరకు పంపాలని సూచించారు. అధికారులు పరిశీలించిన ఏజెన్సీ జాబి తాను ఈనెల 13 కలెక్టర్ పరిశీలించనున్నట్లు అధికారికి వర్గాలు చెబుతున్నా యి. స్క్రూటినీ చేసి ఏఏ ఏజెన్సీలకు అర్హత ఉందో కలెక్టర్ అదేరోజు ఫైనల్ చేయనున్నట్లు చెబుతున్నారు. మొత్తం పది ఏజెన్సీలకు ఒక్కో ఏజెన్సీకి వంద చొప్పున పోస్టుల భర్తీ కోసం ఉద్యోగుల నియామకాలకు సంబంధించి అనుమతులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

  ఓ ఏజెన్సీ నిర్వాహకుడు దరఖాస్తు తప్ప మిగితావన్నీ ఇతర ఏజెన్సీల అర్హత పత్రాలే సమర్పించినట్లు అధికారుల దృష్టికి వచ్చింది. 2012 ఆగస్టులో జరిపిన అవుట్ సోర్సింగ్ నియామకాలలో ఓ ఏజెన్సీకి 70 పోస్టుల భర్తీ అప్పగించారు. అయితే, ఆ ఏజెన్సీ 30 మందికి మాత్రమే ఈఎస్‌ఐ, పీఎఫ్ చెల్లిం చినట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి.

>
మరిన్ని వార్తలు