ఆదిలాబాద్‌ బల్దియా టీఆర్‌ఎస్‌ కైవసం

28 Jan, 2020 08:36 IST|Sakshi
ప్రేమేందర్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న కౌన్సిలర్లు

చైర్మన్, వైస్‌ చైర్మన్‌ రెండు పదవులు వారికే

చైర్మన్‌గా జోగు ప్రేమేందర్‌ ఏకగ్రీవం

వైస్‌ చైర్మన్‌గా జహీర్‌ రంజాని, ఎంఐఎంకు చెక్‌

మున్సి‘పోల్స్‌’ చదరంగంలో జోగురామన్న పావులు సక్సెస్‌

సాక్షి,ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ బల్దియాపై సంపూర్ణంగా గులాబీ జెండా ఎగిరింది. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ రెండూ పదవులను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. గత పాలకవర్గంలో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కారు పార్టీ గద్దెనెక్కింది. అయితే ఈమారు మాత్రం టీఆర్‌ఎస్‌ ఒంటరిగా అధికారం దక్కించుకుంది. చైర్మన్‌గా ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న తనయుడు జోగు ప్రేమేందర్, వైస్‌ చైర్మన్‌గా టీఆర్‌ఎస్‌ పార్టీకే చెందిన మహ్మద్‌ జహీర్‌ రంజానిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

చైర్మన్, వైస్‌ చైర్మన్‌లు ఏకగ్రీవం..
మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ సంధ్యారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కొంత మంది తెలుగులో, కొంత మంది హిందీలో, ఒకరు ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేశారు. 11.53 గంటలకు ప్రమాణస్వీకారం ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో చైర్మన్, వైస్‌ చైర్మన్‌ల ఎన్నిక నిర్వహిస్తామని జేసీ పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన 24 మంది సభ్యులకు తోడు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు పార్టీలో చేరడంతో బలం 26కు చేరుకుంది.

బీజేపీ 11 మంది సభ్యులు, కాంగ్రెస్‌ ఐదుగురు, ఎంఐఎం ఐదుగురు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. కాగా బీజేపీ తరఫున ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు, టీఆర్‌ఎస్‌ తరఫున ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న మున్సిపాలిటీలో ఎక్స్‌అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. అయితే ఎంపీ సోయం బాపురావు గైర్హాజరు కాగా ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఇకపోతే కౌన్సిలర్లు 49 మంది, ఎక్స్‌అఫీషియో మెంబర్‌ ఎమ్మెల్యేను కలుపుకొని 50 మంది ఉండగా, మెజార్టీ 25 వస్తే ఆ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి చైర్మన్‌ అవుతారని జేసీ వివరించారు. అయితే కేవలం టీఆర్‌ఎస్‌ నుంచే విప్‌ నోటీస్‌ అందినట్లు తెలిపారు. ఇతర పార్టీలు విప్‌ నోటీస్‌ అందించలేదని స్పష్టం చేశారు.

అనంతరం టీఆర్‌ఎస్‌ నుంచి 34వ వార్డు కౌన్సిలర్‌ జోగు ప్రేమేందర్‌ పేరును చైర్మన్‌ అభ్యర్థిగా, 45వ వార్డు కౌన్సిలర్‌ బండారి సతీష్‌ ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్‌ జాదవ్‌ పవన్‌నాయక్‌ బలపర్చారు. ఇతర పార్టీల నుంచి చైర్మన్‌ అభ్యర్థిత్వానికి ఎవరూ పోటీ పడలేదు. దీంతో జోగు ప్రేమేందర్‌ ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. అనంతరం టీఆర్‌ఎస్‌కే చెందిన 29వ వార్డు కౌన్సిలర్‌ మహ్మద్‌ జహీర్‌ రంజాని పేరును వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి ఆ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్‌ అలాల అజయ్‌ ప్రతిపాదించగా, 9వ వార్డు కౌన్సిలర్‌ ఉష్కం రఘుపతి బలపర్చారు. ఇక్కడ కూడా ఇతర పార్టీల నుంచి ఎవరూ వైస్‌ చైర్మన్‌ అభ్యర్థిత్వానికి పోటీకి రాకపోవడంతో మహ్మద్‌ జహీర్‌ రంజాని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు.

తండ్రికి పాదాభివందనం..
నూతన చైర్మన్, వైస్‌ చైర్మన్‌తో జాయింట్‌ కలెక్టర్‌ సంధ్యారాణి ప్రమాణస్వీకారం చేయించడంతో ప్రత్యేక సమావేశం ముగిసింది. అనంతరం నూతన చైర్మన్, వైస్‌ చైర్మన్‌లతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్‌ చాంబర్‌లో జోగు రామన్న కుటుంబ సభ్యులు అందరు కలిసి జోగు ప్రేమేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జోగు ప్రేమేందర్‌ తండ్రి జోగురామన్నకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు.

ఎంఐఎంకు చెక్‌..
వైస్‌ చైర్మన్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మున్సిపల్‌ ఎన్నికల్లో పార్టీకి అవసరమైన మెజార్టీ లభించడంతో సొంతగానే పాలకవర్గం ఏర్పాటుకు ఆసక్తి చూపిందనేది స్పష్టమవుతుంది. గత పాలకవర్గంలో ఎంఐఎంకు వైస్‌ చైర్మన్‌ పదవిని కట్టబెట్టారు. ఈమారు టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన ముస్లిం నాయకుడు మహ్మద్‌ జహీర్‌ రంజానికి పదవి కల్పించారు. తద్వారా ఎంఐఎంకు చెక్‌ పెట్టారన్న చర్చ సాగుతుంది. కాగా మున్సిపోల్స్‌లో ఆది నుంచి ఎమ్మెల్యే జోగురామన్న వ్యూహాత్మకంగా పావులు కదిపారన్న ప్రచారం జరుగుతోంది. చైర్మన్, వైస్‌ చైర్మన్‌ ఎన్నిక ఘట్టంలోనూ తన రాజకీయ చతురతను చాటి నియోజకవర్గంలో బలమైన నేతగా మరోసారి నిరూపించుకున్నారన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది.

మరిన్ని వార్తలు