మరణాలు కనిపించడం లేదా..!

31 Aug, 2014 02:58 IST|Sakshi
మరణాలు కనిపించడం లేదా..!

ఉట్నూర్  : ‘ఏజెన్సీలో ప్రతిరోజూ నలుగురైదుగురు గిరిజనులు జ్వరాలతో చనిపోతున్నారు. గిరిజనులకు అందుతున్న వైద్యం దుస్థితిపై రోజూ మీడి యా కోడై కూస్తోంది. ప్రభుత్వ ప్రతినిధులుగా ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. మేము ఒకటి అడిగితే మీరు మరోటి చెబుతున్నారు. మాకేం పని లేక ఈ మీటింగ్ పెట్టుకోలేదు.’ అంటూ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న వైద్యాధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
 
శనివారం కేబీ ప్రాంగణంలోని పీఎమ్మార్సీ మందిరంలో కలెక్టర్ జగన్మోహన్ అధ్యక్షతన వైద్యశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్, ఖానాపూర్, సిర్పూర్(టి), నిర్మల్, ముథోల్, బోథ్ ఎమ్మెల్యేలు అజ్మీరా రేఖ, కోనేరు కోనప్ప, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, బాపూరావు, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో ప్రశాంత్‌పాటిల్, ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏజెన్సీలో రోజూ గిరిజనులు వివిధ వ్యాధులతో చనిపోతున్నా అధికారులు ఏం చేస్తున్నారో తెలియడం లేదన్నారు. గిరిజనుల మరణాలు ఎలా అరికట్టాలో తక్షణ చర్యలు తీసుకునేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో వ్యాధుల పరిస్థితిపై కలెక్టర్ డీఎంవో అల్హం రవిని అడిగి తెలుసుకున్నారు. జిల్లావ్యాప్తంగా మలేరియాతో ఇద్దరే మృతిచెందారని, ఈనెల చివరి వరకు 323 మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. అంకోలి పీహెచ్‌సీ ఆదిలాబాద్ అర్బన్‌లో ఎక్కువగా ఉన్నాయని వివరిస్తుండగా.. సంబంధిత వైద్యాధికారి ఆదిలాబాద్ అర్బన్ తన పరిధిలోకి రాదని స్పష్టం చేశారు.
 
ఇప్పటి వరకు జిల్లాలో 45 డెంగీ కేసులు నమోదయ్యాయని, భీమిని మండలంలో అత్యధికంగా నమోదు కాగా.. మరో 11 మండలాల్లో ఉన్నాయని వివరించారు. డెంగీ నిర్ధారణ కిట్లు రిమ్స్, మంచిర్యాల ఏరియా ఆస్పత్రిలో అందుబాటులో ఉండడంతో గిరిజనులు దూర ప్రాంతాలకు వెళ్లలేకపోతున్నారని అన్నారు. ఖానాపూర్ మండలంలోని రాజూరాలో నమోదైన రెండు డెంగీ కేసులపై వివరణ ఇస్తూ.. గ్రామంలో పారిశుధ్యం పేరుకుపోవడం, క్లోరినేషన్ లేకపోవడం.. దోమల వ్యాప్తి చెందడమే కారణమన్నారు. దీనిపై కలెక్టర్ వెంటనే ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ చంద్రసేన్‌ను వివరణ కోరగా.. ఆయన ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
 
జిల్లావ్యాప్తంగా జ్వరాలు, వ్యాధులతో 69 మంది మృతిచెందారని డీఎమ్‌వో పవర్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ.. సారంగాపూర్ మండలంలో ఒకే రోజు వ్యవధిలో అన్నాచెల్లెలు చనిపోతే ఆ వివరాలు మీ నివేదికలు ఎందుకు లేవంటూ నిలదీశారు. డీఎంహెచ్‌వో బస్వేశ్వరి వివరణ ఇస్తూ.. తమకు ఇంకా వారి డెట్ ఆడిట్ రిపోర్టు రాలేదన్నారు. ముథోల్ నియోజకవర్గంలోని కుభీర్, తానూర్, కుంటాలకు ఐటీడీఏ నుంచి ఎలాంటి ప్రయోజనాలు అందడం లేదని ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి వివరించారు. కుభీర్ పీహెచ్‌సీకి భవనం మంజూరై బేస్‌మెంట్ వరకు నిర్మాణం పూర్తైనిలిచినా కాంట్రాక్టర్‌పై ఎలాంటి చర్యలు లేవన్నారు.
 
కొమురం భీమ్ ప్రాజెక్టు నుంచి ఏజెన్సీలోని 210 గిరిజన గ్రామాలకు మంచినీరు అందించేందుకు రూ.68 కోట్లతో ప్రారంభించిన మంచినీటి పథకం ఇంకా పూర్తికాలేదని, అది పూర్తయితే ఇంతమంది గిరిజనులు చనిపోయే వారు కాదని ఎమ్మెల్యే కోనప్ప వివరించారు. కుందారంలో విధులు నిర్వర్తించే వైద్యాధికారి వందకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న బెజ్జూర్‌కు డిప్యుటేషన్‌పై పంపిస్తే ఆయన ఎలా విధులు నిర్వర్తిస్తారని.. బెజ్జూర్ పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులను నియమించాలన్నారు.
 
వెంటనే సంబంధిత కాంట్రాక్ట్ కంపెనీకి నోటీసులు ఇవ్వాలని.. అలాగే శాఖకు చెందిన ఖానాపూర్ ఏఈపై ఎలాంటి తీసుకుంటారో వెంటనే తనకు రిపోర్టు చేయాలని ఎస్‌ఈ చంద్రసేన్‌ను మంత్రి ఆదేశించారు. పీహెచ్‌సీల్లో టూర్ డైరీ లేదని, ఎక్కడికి వెళ్లేది అందులో పూర్తిగా నమోదు చేయాలని ఎంపీ నగేష్ పేర్కొన్నారు. ఈ మూడు నెలలైనా జ్వర మరణాలు లేకుండా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని మంత్రి సూచించారు.
 
అంబులెన్సులు ఎక్కడ..?
పీహెచ్‌సీలకు అంబులెన్సులు పెట్టుకోండని ప్రభుత్వం పీహెచ్‌సీ ఖాతాల్లో నిధులు జమ చేస్తే ఎంత మంది మెడికల్ అధికారులు అంబులెన్సులో వాడుతున్నారో తెలపాలని ఎమ్మెల్యే కోనప్ప అదనపు వైద్యాధికారి ప్రభాకర్‌రెడ్డిని కోరారు. మంత్రి కలగజేసుకుని వైద్యులు దేవుళ్లతో సమానం అంటారు.. నిజం చెప్పం డని వైద్యాధికారులను నిలదీశారు. దీంతో అందరం అంబులెన్సులో వాడుతున్నామని సమాధానం ఇవ్వడంతో ప్రజాప్రతినిధులు ఒక్కసారిగా మండిపడ్డారు. అంబులెన్సులు ఉంటే లేవని పత్రికల్లో వార్తలు ఎందు కు వస్తాయని, రెండు రోజుల్లో సంబంధిత నివేదికలు సమర్పించాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో ఆర్డీవో రాంచంద్రయ్య, ఈఈటీడబ్ల్యూ శంకరయ్య, ఇమ్యునైజేషన్ అధికారి చందు, జెడ్పీటీసీ జగ్జీవన్, ఎంపీపీ విమల, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు