చివరిరోజు సిద్ధిధాత్రిగా దర్శనమిచ్చిన జోగుళాంబ

8 Oct, 2019 09:59 IST|Sakshi
విద్యుద్దీపాలతో వెలుగొందుతున్న జోగుళాంబ ఆలయం; టీకే శ్రీదేవి, ఎమ్మెల్యే అబ్రహంను ఆశీర్వదిస్తున్న అర్చకులు

నవమం.. సిద్ధిధాత్రిం

చివరిరోజు ఆలయానికి పోటెత్తిన భక్తజనులు

జోగుళాంబ అమ్మవారికి ప్రత్యేక పూజలు, అర్చనలు

రేపు తెప్పోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు

సాక్షి, జోగుళాంబ: దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం చివరిరోజు సిద్ధిదాత్రిదేవీ అలంకరణతో అమ్మవారి తొమ్మిది అవతారాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా జోగుళాంబదేవిని చివరిరోజు సిద్ధిదాత్రి దేవిగా అలంకరించి ఆరాదించారు.  అమ్మవారికి ప్రాథఃకాలం నవవిధ ఔషధీమూలికా జలాలతో అభిషేకాలు చేశారు. పట్టువస్త్రాలు, వివిధ రకాలతో పూలతో అమ్మవారిని అలంకరించి దశవిధ హారతులు ఇచ్చారు. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం త్రికాల సమయంలో అమ్మవారికి భక్తులు ప్రత్యేకంగా కంకుమార్చనలు, సహస్రనామార్చనలు, నవావరన అర్చనలు నిర్వహించారు. అదేవిధంగా యాగశాలలో సర్వతోభద్ర మండలానికి ఆవాహిత దేవతాపూజలు జరిపించారు.  

సంకల్పాన్ని నెరవేర్చే అమ్మవారు 
భక్తులు త్రికరణ శుద్ధిగా కోరే సంకల్పాలను నెరవేర్చే తల్లి సిద్ధిద్రాతి అని ఆలయ అర్చకులు తెలిపారు. అందుకే నవరాత్రి దీక్ష చేయలేని వారు చివరిరోజు అయినా సిద్ధిధాత్రిని ఆరాదించాలని పేర్కొన్నారు. సిద్ధిదాత్రి అనుగ్రహం ఉంటే అష్టసిద్ధులలోని అనిమాసిద్ధి, మమా సిద్ధి, గిరిమా సిద్ధులతోపాటు ఆదిపరాశక్తి అనుగ్రహం కలుగుతుందన్నారు.

నేడే తెప్పోత్సవం.. 
విజయ దశమిని పురస్కరించుకొని.. ఉత్సవాల ముగింపులో భాగంగా నవరాత్రి ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్శనగా నిలిచే తెప్పోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం 7 గంటలకు నిర్వహించనున్నారు. ఇందుకోసం సర్వం సిద్ధం చేసినట్టు దేవస్థానం ఈఓ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. కాగా ఏర్పాట్లపై సోమవారం సాయంత్రం ఆయన మరోమారు పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. 

వారోత్సవ రథోత్సవం 
ప్రధాన ఆలయమైన బాలబ్రహ్మేశ్వరుడికి సోమవారం వారోత్సవం కావడంతో సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ విగ్రహాలను రథోత్సవంలో కూర్చోబెట్టి ఆలయ ప్రాకార మండపం చుట్టూ ముమ్మూర్లు ప్రదక్షిణలు గావించారు. కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 

జోగుళాంబ సన్నిధిలో సీడీఎంఏ 
జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను మధ్యాహ్నం కమిషనర్‌ అండ్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (సీడీఎంఏ) టీకే శ్రీదేవి, అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం దర్శించుకున్నారు. వారికి దేవస్థానం ఈఓ ప్రేమ్‌కుమార్‌ ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికారు. దేవీ నవరాత్రి సందర్భంగా సీడీఎంఏ టీకే శ్రీదేవిని అలంపూర్‌ జోగుళాంబ ఆలయానికి ఆహ్వానించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఉభయ ఆలయాల్లో అర్చకులు వారితో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం తీర్థప్రసాదాలు ఇచ్చి ఆశీర్వచనం చేయగా.. దేవస్థానం ఈఓ టీకే శ్రీదేవికి, ఎమ్మెల్యేకు శేషవస్త్రాలను అందజేశారు. వీరితోపాటు ఎంపీడీఓ, ఇన్‌చార్జ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మల్లికార్జున్, తహసీల్దార్‌ తిరుపతయ్య, ఏఎస్‌ఐ తిమ్మరాజు తదితరులున్నారు. 

మరిన్ని వార్తలు