రబీ కొనుగోళ్లకు 161 కేంద్రాలు

22 Feb, 2018 16:45 IST|Sakshi
మాట్లాడుతున్న జేసీ యాస్మిన్‌బాషా, సమీక్షకు హాజరైన అధికారులు

48 గంటల్లో ధాన్యం సొమ్ము చెల్లింపు

రోజూ ట్యాబ్‌ల్లో కొనుగోలు వివరాలు

జాయింట్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా

రబీ ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో సమీక్ష

సిరిసిల్ల : జిల్లావ్యాప్తంగా రబీ సీజన్‌లో ధాన్యం కొనుగోళ్ల కోసం 161 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జాయింట్‌ కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌బాషా తెలిపారు. కలెక్టరేట్‌లో బుధవారం డీఆర్‌డీవో, మార్కెటింగ్, పౌర సరఫరాలు, వ్యవసాయశాఖ అధికారులతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్షించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేస్తామన్నారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు పండించిన ప్రతీ గింజ కొనుగోలు చేయాలని సూచించారు. రబీ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లను మార్చి మూడో వారంలో ప్రారంభించాలని, అందుకు అవసరమైన గన్నీ సంచులు, తూకం యంత్రాలు అందుబాటులో ఉంచాలని ఆమె సూచించారు.

రైతుల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఏరోజుకు ఆరోజే ట్యాబ్‌ల్లో నమోదు చేసి 48 గంటల్లో రైతుల ఖాతాల్లో డబ్బు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఎదురైన ఇబ్బందులు, పొరపాట్లు మళ్లీ జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు నీటివసతి, టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. తూకంలో మోసాలు లేకుండా, హమాలీల సమస్య లేకుండా చూడాలని ఆదేశించారు. తూకం వేసిన ధాన్యం ఎప్పుటికప్పుడు మిల్లులకు తరలించేందుకు లారీలను సమకూర్చుకోవాలని చెప్పారు. ఇందుకు అనుగుణంగా జిల్లాలో ధాన్యం కొనుగోళ్లకు పక్కాగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కోరారు. అన్నిప్రభుత్వ శాఖలు సమన్వయంలో పనిచేసి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను సజావుగా కొనసాగించాలని సూచించారు. ఈసమావేశంలో డీఆర్‌డీవో బి.రవీందర్, డీఎస్‌వో పద్మ, జిల్లా వ్యవసాయాధికారి ఆర్‌.అనిల్‌కుమార్, మార్కెటింగ్‌శాఖ జిల్లా మేనేజర్‌ షాహబొద్దీన్, పౌరసరఫరాల జిల్లా మేనేజర్‌ శ్రీకాంత్, వ్యవసాయాధికారి కె.తిరుపతి, ఐకేపీ ఏపీఎం పర్శరాం తదితరులు పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు