ఈసారైనా పదవొచ్చేనా?

18 Feb, 2019 12:09 IST|Sakshi

జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న జుక్కల్‌ నియోజకవర్గానికి ఇప్పటివరకు అమాత్య యోగం అందని ద్రాక్షగానే ఉండిపోయింది. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ఈ నియోజకవర్గంనుంచి గెలిచినవారిని పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే వరుసగా మూడుసార్లు గెలిచి నియోజకవర్గంలో తొలి హ్యాట్రిక్‌ సాధించారు. ఆయనకు మంత్రి పదవి ఇచ్చి, వెనకబడిన ప్రాంత అభివృద్ధికి సహకరించాలని ప్రజలు కోరుతున్నారు.

పిట్లం: జుక్కల్‌ నియోజకవర్గం మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది. ఇక్కడ మూడు రా ష్ట్ర సంస్కృతులు పరిడవిల్లుతున్నాయి. 1957లో జుక్కల్‌ నియోజకవర్గం ఏర్పాటైంది. తొలి ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థి మాధవరావు దేశాయి ఎన్నికయ్యారు. 1962లో కాంగ్రెస్‌ అభ్యర్థి నాగనాథ్‌రావు విజయం సాధించారు. 1967లో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి విఠల్‌రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1972లోనూ ఈయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు.  

1978లో జుక్కల్‌ను ఎస్సీ రిజర్వ్‌డ్‌గా మార్చారు. సౌదాగర్‌ గంగారాం కాంగ్రెస్‌(ఐ) అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 1983లోనూ గెలిచి వరుసగా రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 1985లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయన ఓటమి పాలయ్యారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పండరి ఎమ్మెల్యే అయ్యారు. 1989లో జరిగిన ఎన్నికలలో తిరిగి సౌదాగర్‌ గంగారాం గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటర్లు టీడీపీ అభ్యర్థి పండరిని గెలిపించారు. 1999లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అరుణతార విజయం సాధించారు. 2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి సౌదాగర్‌ గంగారాం గెలిచారు. 2009లో టీడీపీ అభ్యర్థి హన్మంత్‌ సింధే గెలుపొందారు. ఆయన 2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి ఎమ్మెల్యే అయ్యారు. 2019లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగానే పోటీ చేసిన సింధే.. వరుసగా మూడోసారి విజయబావుటా ఎగురవేశారు.

తొలి హ్యాట్రిక్‌..
జుక్కల్‌ నియోజక వర్గం ఏర్పాటైనప్పటినుంచి 14 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. తొలి హ్యాట్రిక్‌ మాత్రం హన్మంత్‌ సింధేదే.. సౌదాగర్‌ గంగారాం నాలుగుసార్లు విజయం సాధించానా.. ఆయన వరుసగా మూడుసార్లు గెలుపొందలేదు. విఠల్‌రెడ్డి రెండుసార్లు మాత్రమే గెలిచారు. పండరి కూడా రెండు విజయాలే నమోదు చేశారు. హన్మంత్‌ సింధే మాత్రం 2009 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. ఆయన మూడు దఫాలూ 30 వేల పైచిలుకు మెజారిటీతో గెలుపొందడం గమనార్హం. 2004లో మొదటిసారి తెలుగుదేశం తరఫున పోటీ చేసిన సింధే.. 1,241 ఓట్ల తేడాతో సౌదాగర్‌ గంగారాం చేతిలో పరాజయం చవిచూశారు. 2009నుంచి వెనుదిరిగి చూడలేదు. 2009లో తెలుగుదేశం నుంచి రెండోసారి పోటీ చేసిన సింధే.. 34058 ఓట్ల మెజారిటీతో గంగారాంపై గెలుపొందారు. తరువాత తెలంగాణ ఉద్యమం ప్రభావంతో టీఆర్‌ఎస్‌లో చేరిన ఆయన.. 2014లో జరిగిన ఎన్నికల్లో గంగారాం సతీమణి సావిత్రిబాయిపై 35,007 వేల మెజారిటీతో విజయం సాధించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో మరోసారి గంగారాంపై 35,624 ఓట్ల తేడాతో గెలిచారు.  

అవకాశం దక్కేనా?
జుక్కల్‌ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు 14 సార్లు ఎన్నికలు జరిగినా.. ఒక్కసారి కూడా మంత్రి పదవి లభించలేదు. రాష్ట్రంలో వెనకబడిన ప్రాంతం జుక్కల్‌ నియోజక వర్గం. ఈ నియోజకవర్గంనుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారికి మంత్రి పదవి ఇస్తే అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆశిస్తున్నారు. కానీ ఎప్పటికప్పుడు నిరాశే ఎదురవుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈసారైనా సింధేకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు