వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్‌

15 Jun, 2019 05:35 IST|Sakshi
మిషన్‌ భగీరథ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: వారం, పదిరోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌ పవర్‌తోపాటు అధికారాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. మిషన్‌ భగీరథ పథకం పనుల పురోగతిపై మంత్రి శుక్రవారం హైదరాబాద్‌లో ఆ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. సమీక్షాసమావేశంలో ఈఎన్‌సీ కృపాకర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు జ్ఞానేశ్వర్, చీఫ్‌ ఇంజనీర్లు, కన్సల్టెంట్లు పాల్గొన్నారు. రోజువారీ నీటి సరాఫరా, ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌లు, గ్రామాల్లో అంతర్గత నీటి సరాఫరా పనులపై ప్రత్యేకంగా సమీక్షించారు.

ఇంటింటికీ శుద్ధమైన తాగునీటి పంపిణీలో ఇబ్బందుల్లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నీటి సరఫరాలో అవాంతరాలు ఉండొద్దని స్పష్టం చేశారు. మిషన్‌ భగీరథ పథకం కోసం కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు తెచ్చుకునేలా ప్రయత్నిద్దామని చెప్పారు. మిషన్‌ భగీరథ దేశానికే ఆదర్శంగా నిలిచిందని, ఇటీవల కేంద్ర ప్రభుత్వ సమావేశంలోనూ ఇతర రాష్ట్రాలు, కేంద్ర ప్రతినిధులు ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని చెప్పారు.  

మిగిలిపోయిన పనులకు జూలై 15 డెడ్‌లైన్‌
‘మిషన్‌ భగీరథ పనులు బాగా జరుగుతున్నాయి. ఇప్పటికే దాదాపుగా పూర్తయ్యాయి. మీ పని తీరువల్లే ఇది సాధ్యమైంది. మిగిలిపోయిన పనులను కూడా జూలై 15 లోపు పూర్తి చేసి ఇంకా మంచిపేరు తెచ్చుకోవాలి. కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ ఎంతో గొప్పది. టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఇదే. నా 33 ఏళ్ల రాజకీయ అనుభవంతో చెబుతున్నా. ఎప్పుడు ప్రచారానికి వెళ్లినా బిందెలు, కుండలతో నీళ్ల కోసం మహిళలు ఎదురుపడేవారు. మిషన్‌ భగీరథతో ఇలాంటి పరిస్థితి లేకుండా పోయింది.

ప్రతి గ్రామంలో తాగునీటి సరఫరా విషయంలో ప్రభుత్వంపై సానుకూలత ఏర్పడింది’అని మంత్రి అన్నారు. గ్రామాల్లో తాగునీటి సరఫరా ప్రక్రియను మరింత పటిష్టం చేయాలని, వారం, పది రోజుల్లో సర్పంచ్‌లకు చెక్‌పవర్, అధికారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ‘గ్రామపంచాయతీ నిధులతో వాటర్‌ట్యాంకుల మరమ్మతు పనులు చేయించండి. సర్పంచ్‌లతో సమన్వయం చేసుకుంటూ వేగంగా పనులు పూర్తి అయ్యేలా చూడండి.

ఓవర్‌హెడ్‌ ట్యాంకుల నిర్మాణం గడువులోపు పూర్తి కావాలి. గ్రామాల్లో అంతర్గత నీటి సరఫరా పనులు కీలకం. ఈ పనుల కోసం తవ్విన సిమెంట్‌ రోడ్లను వెంటనే పునరుద్ధరించాలి. పాత రోడ్డు తరహాలోనే ఈ మరమ్మతులుండాలి.. గ్రామాల్లో ఉండే ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు, అంగన్‌వాడీలకు కచ్చితంగా నీటి సరఫరా చేయాలి. దీనికి తగినట్టుగా పనులు చేయాలి’’అని అధికారులకు మంత్రి దయాకర్‌రావు సూచించారు.

మరిన్ని వార్తలు