31 డేస్‌... 34 రోడ్స్‌ యమా స్పీడ్‌గా..

1 Dec, 2017 07:35 IST|Sakshi

వడివడిగా జంక్షన్లు, రహదారుల విస్తరణ

డిసెంబర్‌ 31 లోగా 34 మార్గాలు లక్ష్యం

భూ/ఆస్తుల సేకరణ పూర్తి చేసిన వారికి నజరానా

ప్రతి మూడునెలలకు 35 మార్గాల్లో పనులు: జీహెచ్‌ఎంసీ

సిటీలో ట్రాఫిక్‌ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలంటే జంక్షన్లు, రహదారుల విస్తరణ తప్పనిసరి. ఈ నేపథ్యంలో గుర్తించిన ప్రాంతాల్లో ఈ పనులు వేగవంతంగా చేపట్టాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఈ మేరకు వచ్చే 31 రోజుల్లో 34 మార్గాల్లో రహదారి విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి పనులకు అవసరమైన భూ/ఆస్తుల సేకరణ పూర్తి కావాలని లక్ష్యం విధించింది. ఈ పనులు త్వరితగతిన పూర్తి చేసిన అధికారులకు నజరానా సైతం ఇస్తామని ప్రకటించింది. ప్రతి మూడు నెలలకు 35 మార్గాల్లో పనులు చేపట్టేలా ప్రణాళిక రూపొందించింది. తొలి విడతగా ఉప్పల్‌–నల్లచెరువు, ఎల్‌బీ నగర్‌ జంక్షన్‌ తదితర ప్రాంతాలు విస్తరణకు నోచుకోనున్నాయి. ఇదే జరిగితే ఈ రెండు ప్రాంతాల్లో  రాకపోకలు సాఫీగా సాగుతాయి. ప్రజలకు ట్రాఫిక్‌ కష్టాలు తీరుతాయి.    

సాక్షి, సిటీబ్యూరో: 31 రోజులు.. 34 మార్గాలు..   జంక్షన్లు, రహదారుల విస్తరణకు అవసరమైన భూ/ఆస్తుల సేకరణను  త్వరితంగా పూర్తిచేసేందుకు ఇదీ జీహెచ్‌ఎంసీ లక్ష్యం. నగరంలోని అనేక మార్గాల్లో రహదారులు ఇరుకై, బాటిల్‌నెక్స్‌తో ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. తరచూ ట్రాఫిక్‌ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి జంక్షన్ల అభివృద్ధి, రహదారుల విస్తరణ, ఫ్లై ఓవర్లు, ఆర్‌యూబీలు, ఆర్‌ఓబీల పనులకు ప్రణాళికలు రూపొందించినప్పటికీ, ఏళ్ల తరబడి పనులు ముందుకు సాగడం లేవు. దీనికి ప్రధాన అవరోధం ఆయా మార్గాలు, జంక్షన్ల విస్తరణకు అవసరమైన ఆస్తుల సేకరణ. ఎంతో కాలంగా ఈ ప్రక్రియ పూర్తి కావడం లేదు.

ఆయా ప్రాంతాల్లోని ఆస్తుల యజమానుల్ని సంప్రదింపుల ద్వారా ఒప్పించలేకపోతున్నారు. మొండికేసిన వారి విషయంలో భూసేకరణ చట్టం మేరకు సేకరించాల్సి ఉంది. విస్తరణ పనులు జరగాలంటే తొలుత ఆస్తుల సేకరణ పూర్తికావాలి కనుక టౌన్‌ప్లానింగ్‌ అధికారులతో ప్రత్యేక టీమ్‌లు ఏర్పాటు చేశారు. జోనల్‌ కమిషనర్‌ నోడల్‌ ఆఫీసర్‌గా, ఒక్కో మార్గానికి ఒక్కో ఏసీపీ, ఇద్దరు సెక్షన్‌ ఆఫీసర్లతో ఈ కమిటీలు నియమించారు. తమకప్పగించిన 34 మార్గాల్లో  ఆస్తుల సేకరణను డిసెంబర్‌లోగా వారు పూర్తిచేయాలి. అలా లక్ష్యాన్ని సాధించిన వారికి ప్రశంసాపత్రాలతోపాటు ప్రత్యేక నజరానాలు ఇవ్వనున్నారు. 

ఎస్సార్‌డీపీ,హెచ్‌ఆర్‌డీసీ పనులకు కూడా  ..
రహదారులు, జంక్షన్ల అభివృద్ధికి వివిధ పథకాల కింద పనులు చేస్తుండటంతో కొన్ని ఎస్సార్‌డీపీ(వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం), కొన్ని హెచ్‌ఆర్‌డీసీ(హైదరాబాద్‌ రోడ్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌)ల ద్వారా చేపట్టారు.  ఆస్తుల సేకరణ పూర్తికానందున ఈ పథకాల్లోని పనులూ ముందుకు సాగడం లేవు.  ఈ పథకాల కింద చేయాల్సిన పనులకు, ఈ పథకాల పరిధిలోలేని వాటికి కూడా టౌన్‌ప్లానింగ్‌ టీమ్‌లు ఆస్తుల సేకరణ పూర్తి చేయాలి. టౌన్‌ప్లానింగ్‌ ఏసీపీలకు సహాయంగా కొత్తగా ఔట్‌సోర్సింగ్‌పై తీసుకున్న ఏఈల సేవల్ని కూడా వినియోగించుకోనున్నట్లు చీఫ్‌ సిటీప్లానర్‌ ఎస్‌.దేవేందర్‌రెడ్డి తెలిపారు. సేకకరించాల్సిన ఆస్తులు వేల సంఖ్యలో  ఉండటంతో దశలవారీగా ఆస్తుల్ని సేకరించనున్నటు చెప్పారు. తొలి దశలో డిసెంబర్‌ నెలాఖరులోగా 34 మార్గాల్లో, ఆ తర్వాత ప్రతి మూడుమాసాలకు దాదాపు 35 మార్గాల్లో భూసేకరణ పూర్తిచేయాలనేది లక్ష్యం. మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం దాదాపు 150 మార్గాలను విస్తరించాల్సి ఉండటంతో ఆ పనులు చేసేందుకు ఈ లక్ష్యంతో పనులు చేయనున్నారు. భూ/ ఆస్తుల సేకరణ పూర్తికాగానే పనులు పూర్తిచేయనున్నారు. 

తొలి దశలో..
డిసెంబర్‌ నెలాఖరులోగా ఆస్తులు సేకరించాల్సిన మార్గాలు ఇవీ... చర్లపల్లి ఆర్‌ఓబీ (34 ఆస్తులు), ఉప్పల్‌ జంక్షన్‌– నల్లచెరువు(168), ఎల్‌బీనగర్‌ జంక్షన్‌ (54), బైరామల్‌గూడ జంక్షన్‌( 57), కామినేని జంక్షన్‌(57), కొత్తపేట – నాగోల్‌ ( 216), సైదాబాద్‌ రోడ్‌( 51), రక్షాపురం– హబీబ్‌నగర్‌(49), బాలాపూర్‌ జంక్షన్‌– డీఆర్‌డీఎల్‌ వయా హఫీజ్‌బాబానగర్‌ (124), బండ్లగూడ జంక్షన్‌– ఎర్రకుంట జంక్షన్‌(125), హిమ్మత్‌పురా – ఫతేదర్వాజ(138), హుస్సేనీ అలం– దూద్‌బౌలి(172), బహదూర్‌పురా(45),గుడిమల్కాపూర్‌ జంక్షన్‌ –లక్ష్మీనగర్‌(26), ఏక్‌మినార్‌ మజిద్‌ – బజార్‌ఘాట్‌ జంక్షన్‌(57), గోల్నాక – అంబర్‌పేట (281)  శాస్త్రిపురం రైల్వేగేట్‌ ఆర్‌ఓబీ, జారాహిల్స్‌ రోడ్‌ నెం.13, (45), బోరబండ పంకా బస్టాప్‌– హైటెక్‌ హోటల్, నారాయణమ్మ కాలేజీ– గచ్చిబౌలి, ఖాజాగూడ జంక్షన్‌ – ఓఆర్‌ఆర్, గచ్చిబౌలి జంక్షన్‌ – కొత్తగూడ, బొటానికల్‌ గార్డెన్‌– ఓల్డ్‌ బాంబే రోడ్, గచ్చిబౌలి జంక్షన్‌– ఓఆర్‌ఓర్‌ (ఫ్రీలెఫ్ట్‌), మాదాపూర్‌ మెగాహిల్స్‌ లింక్‌రోడ్, మూసాపేట క్రాస్‌రోడ్స్‌– కైతలాపూర్, బాలానగర్‌ రోడ్‌ – నర్సాపూర్‌ క్రాస్‌రోడ్స్‌ ఫ్లై ఓవర్, బాలానగర్‌ క్రాస్‌రోడ్స్‌– రేడియల్‌ రోడ్, అంబేద్కర్‌ జంక్షన్‌ – సుచిత్ర జంక్షన్, ఆనంద్‌బాగ్‌ ఆర్‌యూబీ–జడ్‌టీసీ రోడ్, లాలాపేట్‌ ఫ్లై ఓవర్‌–మౌలాలి ఫ్లై ఓవర్, బోట్స్‌క్లబ్‌– కవాడిగూడ మార్గాలున్నాయి.

నోడల్‌ ఆఫీసర్‌ ప్రతిరోజూ పనుల్ని పర్యవేక్షిస్తూ ప్రతి మంగళవారం చీఫ్‌సిటీప్లానర్‌కు పనుల పురోగతిపై నివేదిక అందజేయాల్సి ఉంటుంది. ఇటీవల జీఈఎస్‌ను పురస్కరించుకొని కేవలం నెల రోజుల వ్యవధిలోనే రూ.45 కోట్లతో ఎన్నో మార్గాల్లో రహదారుల్ని తీర్చిదిద్దడంతో కేవలం హైటెక్‌ ప్రాంతాల ప్రజలకే సదుపాయాలు కల్పిస్తున్నారని విమర్శలు వచ్చాయి. దీంతో ఇతర ప్రాంతాల్లోనూ  పనులకు సిద్ధమయ్యారు.

మరిన్ని వార్తలు