2న అమరుల ఆకాంక్షల దినం

22 May, 2019 03:46 IST|Sakshi

నిర్ణయించిన సీపీఐ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భా వం రోజైన జూన్‌ 2ను అమరవీరుల ఆకాంక్షల లక్ష్యసాధన దినంగా నిర్వహించాలని సీపీఐ నిర్ణయించింది. అదేరోజున పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ సమీపంలోని అమరవీరుల స్తూపం వద్ద అమరులకు నివాళి అర్పించడంతో పాటు మఖ్దూంభవన్‌లో జెండా ఎగురవేసి కార్యక్రమాలు నిర్వహించాలని, అలాగే అన్ని జిల్లాల్లోనూ అమరుల ఆకాంక్షల సాధన దినోత్సవాన్ని జరపాలని తీర్మానించింది. మఖ్దూంభవన్‌లో మంగళవారం జరిగిన పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశంలో జాతీయ, రాష్ట్రస్థాయి రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు తదితర అంశాలను చర్చిం చారు. క్షేత్రస్థాయిలో పార్టీని విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణను వివరించారు. ఇటీవల జరిగిన పరిషత్‌ ఎన్నికల్లో ఎంపీపీలతోపాటుగా గణనీయ సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను పార్టీ గెలుచుకుంటుందని నాయకులు అభిప్రాయపడ్డారు.   

పాలన పడకేసింది..  
రాష్ట్రంలో పాలన పూర్తిగా పడకేసిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. కార్యవర్గ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదన్నారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరుల ఆకాంక్షలు నెరవేరలేదన్నారు. యువత బలిదానాల తో పోరాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజాస్వామ్య విలువలకు పాతరేసే విధంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. హైకోర్టు అక్షింతలు వేసినా ఇంటర్‌ ఫలితాల వ్యవహారంలో దోషులను శిక్షించేందుకు, ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లింపు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

మరిన్ని వార్తలు