అమ్మో.. జూన్‌!

10 Jun, 2019 10:47 IST|Sakshi

పేద, మధ్య తరగతి కుటుంబాల వారి జేబులకు చిల్లుపడే మాసం వచ్చేసింది. ఇది సగటు మనిషి ఖర్చులను తలచుకుని వణికే కాలం.. తమ పిల్లలను బడి మెట్లు ఎక్కించేందుకు తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు తంటాలు పడే కాలం.. పొలం పనులు సాగించేందుకు పెట్టుబడుల కోసం ఏం చేయాలా అని అన్నదాత ఆందోళన చెందే కాలం.. ఇలా ఖర్చులతో ముడిపడిన ఈ నెలను నెట్టుకువచ్చేందుకు దాదాపు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అమ్మో జూన్‌ అని భయపడుతుంటారు.

బాన్సువాడ టౌన్‌: జూన్‌ అంటేనే మధ్య తరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఇదే నెలలోనే విద్యా సంస్థలు, వ్యవసాయ పనులు ప్రారంభం అవుతాయి. అటు స్కూల్‌ ఫీజులు, పుస్తకాలకు, ఇటు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల కోసం డబ్బులు అవసరం అవుతాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు చుక్కలనంటుతున్నాయి. బుక్స్, యూనిఫాంలు, పెన్నులు, పెన్సిల్స్‌ ఇతరత్రా వస్తువుల ధరలు పెరిగిపోయాయి. వీటన్నింటిని పిల్లలకు సమకూర్చలేక సామన్య ప్రజానీకం సతమతం అవుతున్నారు. మరో వైపు ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం కావడంతో రైతులు పెట్టుబడి కోసం నానా తిప్పలు పడుతున్నారు. విత్తనాలు ఇతర ఖర్చుల కోసం డబ్బులు ఎలా సమకూర్చుకోవాలో అని ఆలోచిస్తున్నారు. అప్పుల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తూనే బ్యాంకర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.

బడిబాటలో.. 
వేసవి సెలవులు అయిపోవచ్చాయి. పిల్లలు ఆటపాటలు కట్టిపెట్టి బడిబాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఇప్పటి వరకు సరదాగా గడిపిన పిల్లలు ‘అప్పుడే సెలవులు అయిపోయాయే’ అని నిట్టూరుస్తూ బడికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా.. ఫీజులు, పుస్తకాలు, బ్యాగ్, స్టేషనరీ, యూనిఫాం, షూస్‌.. ఇలా పిల్లల స్కూల్‌ ఖర్చులు చూసి తల్లిదండ్రుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  
ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్నాయి. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తకాలు, బట్టలు, యూనిఫారంలతో పాటు స్కూల్స్, కాలేజీలకు కట్టాల్సిన సొమ్ములను పోగుచేసుకునే పనిలో తల్లితండ్రులు తలమునకలయ్యారు. పిల్లల చదువుకు పెట్టే ఖర్చులపై విద్యార్థుల తల్లిదండ్రులు లెక్కలు వేసుకుంటున్నారు. కొత్తగా పిల్లలకు పాఠశాలల్లో అడ్మిషన్‌ తీసుకునే వారు.. ఆయా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు బెంబేలెత్తించేలా వసూలు చేస్తున్న అడ్మిషన్, డోనేషన్‌ ఫీజులను చూసి సామాన్య ప్రజలు జంకుతున్నారు. ఇది వరకే చదువుతున్న వారికి పుస్తకాలు, యూనిఫాం, బెల్ట్, టై, షూ, వాటర్‌బాటిల్స్, పుస్తకాల బ్యాగు తదితర వస్తువుల కోనుగోలుతో తల్లిదండ్రులకు జేబులకు చిల్లుపడుతోంది. ఒక వైపు తమ పిల్లలను ఏ పాఠశాలలో చేర్చించాలి.. ఆయా పాఠశాలల్లో ఏ విధమైన బోధన అందుతోంది.. అక్కడి వాతవారణం, ఫీజులు తదితర అంశాలపై పిల్లల తల్లిదండ్రులు ఆలోచించుకుంటున్నారు. తమ ఆదాయ పరిమితి, చదువుకు ఖర్చు పెట్టే స్థాయిలను బేరీజు వేసుకుంటూ ఏ పాఠశాలలో తమ పిల్లల్ని చేర్చించాలనే విషయమై చర్చించుకుంటుండగా.. కొందరు ఇప్పటికే చదువుతున్న పిల్లలకు ఏ ఏడాది ఎంత ఖర్చు అవుతుందోనని భయందోళనకు గురవుతున్నారు.

గుండె దడదడ 
పాఠశాలల పునఃప్రారంభం వార్త వినగానే సామన్య, మధ్య తరగతి ప్రజానీకం గుండె దడదడమని కొట్టుకుంటోంది. చిరు, ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్న వారు ఈ నెల పిల్లల చదువుల కోసం రూ. వేలల్లో ఖర్చులు చేయాల్సి వస్తోంది. పాఠశాలలకు ముందే తీసుకునే సామగ్రి ఒకటయితే, కొన్ని ప్రైవేటు పాఠశా>లల్లో ముందుగానే ఫీజుల వసూలు చేయడం భయందోలనకు గురిచేస్తుంది. పిల్లల యూనిఫాం, షూ, టై, బెల్ట్, నోట్‌ పుస్తకాలు తదితర స్టేషనరీ సామగ్రి ధరలను సైతం సీజన్‌ను చూసి అమాంతం పెంచుతున్నారు. గత్యంతరం లేక అప్పు చేసి అయినా పిల్లల ఉజ్వల భవిష్యత్‌ కోసం కొనుగోలు చేయక తప్పడం లేదు. చిరు ఉద్యోగి రెండు నుంచి మూడు నెలల వేతనం ఈ జూన్‌ మాసంలో పిల్లల ఖర్చులకు సైతం సరిపోని పరిస్థితి నెలకొంది. నర్సరీ పిల్లల నోటు పుస్తకాలు, ఇతర సామగ్రికి సైతం రూ. వేలు ఖర్చు చేయాల్సి వస్తుండడం ఆర్థిక భారానికి దారితీస్తోంది.
 
భగ్గుమంటున్న ఫీజులు 
ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు ఆకాశాన్నంటుతున్నాయి. జిల్లాలో ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఏడాదికి ఏడాదికి పెరిగిపోతుండగా, ఫీజులు సైతం అదే స్థాయిలో ఉంటున్నాయి. ప్రస్తుతం ఇంగ్లిష్‌ మీడియం చదువులకు ప్రాధాన్యత ఉండడంతో సామన్య, మధ్య తరగతి ప్రజానీకం పిల్లల్ని ప్రైవేటులో చేర్చించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలో ఫీజుల రూపంలో నిలువు దోపిడికి గురవుతున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాయి. చిన్నచిన్న పట్టణాల్లోనూ ఎల్‌కేజీకి సైతం రూ. 8 వేల వరకు ఫీజు వసూలు చేస్తున్నారు. మండల స్థాయిలో ఒక తీరు, ముఖ్య పట్టణాల్లో ఒక తీరు ఫీజులు ఉంటున్నాయి. కాస్త పేరున్న పాఠశాలల వసూళ్లకు అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ ఫీజులకు తోడు తమ పాఠశాలల్లో చేరే విద్యార్థులకు యాజమాన్యాలే యూనిఫాం, టై, బెల్ట్, షూ, నోటు పుస్తకాలు విక్రయిస్తూ దండుకుంటున్నారు. ప్రైవేటును ఆశ్రయిస్తూ ఇలా విద్యార్థుల తల్లిదండ్రులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. స్కూలు ఫీజులకు తోడు రవాణా చార్జీలు అదనంగా వసూలు చేస్తున్నారు. కొన్ని పాఠశాలలు బస్‌ సౌకర్యం కల్పించగా కొందరు సొంతంగా ఆటోలు ఏర్పాటు చేసి పిల్లల్ని పంపుతున్నారు. ఈ క్రమంలో రవాణా చార్జీలు తడిసి మోపెడవుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మధ్యమం ప్రవేశపెట్టి సరిపడా ఉపాధ్యాయులను నియమిస్తే ఈ ఆర్థిక భారం తప్పేదని చాల మంది విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. 

ప్రైవేటులో ఫీజులు ఇలా..

అడ్మిషన్‌ ఫీజు : రూ. 2 వేల నుంచి రూ. 15 వేల వరకూ 
ఎంట్రెన్స్‌ ఫీజు : రూ. వెయ్యి వరకూ 
స్పెషల్‌ ఫీజు : రూ. 3 వేల నుంచి రూ. 10 వేల వరకూ 
తరగతులవారీగా ఫీజులు..
నర్సరీ : రూ. 8 నుంచి రూ. 40 వేలు 
ఎల్‌కేజీ : రూ. 10 వేల నుంచి రూ. 45 వేలు 
యూకేజీ : రూ. 10 వేల నుంచి రూ. 50 వేలు 
1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు : రూ. 12 వేల నుంచి రూ. 75 వేలు 
6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు : 17 వేల నుంచి రూ. లక్ష వరకు 
స్టేషనరీ
నోటు పుస్తకాలు : రూ. 3 వేలు 
యూనిఫాం(2 జతలు) : రూ. 2 వేలు 
బ్యాగ్, బాటిల్‌ తదితర వస్తువులు : రూ. 2 వేలు

మరిన్ని వార్తలు