ఈ ఉద్యోగి మాకొద్దు..

1 Jun, 2018 13:42 IST|Sakshi
లుంగీపై వచ్చి విధులు నిర్వహిస్తున్న దేవకుమార్‌(ఫైల్‌) 

 పద్ధతి మార్చుకోమన్న సీడీపీఓని దుర్భాషలాడిన వైనం

ఈ ఉద్యోగి మాకొద్దు  ఉన్నతాధికారికి మహిళా ఉద్యోగుల ఫిర్యాదు

మధిర : మహిళల అభివృద్ధికోసం ఏర్పాటుచేసిన ఐసీడీఎస్‌ శాఖలో ఉద్యోగినులకు భద్రత కరువైంది. పద్ధతి మార్చుకోమని సూచించిన పై స్థాయి అధికారిపై జూనియర్‌ అసిస్టెంట్‌ దురుసుగా ప్రవర్తించిన సంఘటన గురువారం మధిర ఐసీడీఎస్‌ కార్యాలయంలో చోటుచేసుకుంది. మధిర ఐసీడీఎస్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ సీడీపీఓగా కనకదుర్గ విధులు నిర్వరిస్తున్నారు.

గతంలో మధిర ఐసీడీఎస్‌ శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు విధి నిర్వహణలో అలసత్వం వహించేవారు. దాన్ని కనకదుర్గ గ్రహించి పనితీరును మార్చుకోవాలని వారికి సూచించారు. అదే సమయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న దేవకుమార్‌ను సైతం మందలించారు. అయితే దేవకుమార్‌ ఆమె మాటలను పెడచెవినపెట్టి లుంగీతో కార్యాలయానికి రావడం ప్రారంభించారు.

దీంతో తమకు ఇబ్బందిగా ఉందని మహిళా ఉద్యోగులు సీడీపీఓకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఇది సరైన విధానం కాదని, పద్ధతి మార్చుకోవాలని మరోసారి తీవ్రంగా దేవకుమార్‌ను సీడీపీఓ మందలించారు. దీనిని దృష్టిలో ఉంచుకొని అంగన్‌వాడీ కేంద్రాల అద్దె చెల్లింపు విషయంపై ఉన్నతాధికారులకు ఆన్‌లైన్‌ద్వారా సమాచారం అందిస్తుండగా.. అప్పుడే కార్యాలయానికి వచ్చిన దేవకుమార్‌ తన కంప్యూటర్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నారంటూ ఉన్నతాధికారిణి అనికూడా చూడకుండా దుర్భాషలాడాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న సిబ్బంది.. దేవకుమార్‌ వ్యవహార శైలిపై ఖమ్మం పీడీకి ఫిర్యాదు చేశారు. ఈ విషయంలో సీడీపీఓ కనకదుర్గ కన్నీటి పర్యంతమై.. ఈ ఉద్యోగి తమకొద్దని.. ఉన్నతాధికారులకు దండం పెడతానని ఇక్కడినుంచి పంపించాలంటూ విలేకరుల ఎదుట వాపోయారు.

మరిన్ని వార్తలు