విధుల్లోకి జూడాలు

3 Jul, 2014 01:13 IST|Sakshi
విధుల్లోకి జూడాలు

ప్రభుత్వంతో చర్చలు సఫలం  గాంధీ, ఉస్మానియాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం
ఆస్పత్రుల భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్  డిప్యూటీ సీఎం రాజయ్య, హోం మంత్రి నాయిని వెల్లడి

 
హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో జూడాలు సమ్మె విరమించారు. వైద్యుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడంతో సమ్మె విరమిస్తున్నట్టు జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు ప్రకటించారు. బుధవారం రాత్రి నుంచి విధుల్లో చేరుతున్నట్టు ప్రకటించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. గాంధీ ఆస్పత్రి ఎమర్జెన్సీ విభాగంలో ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న ఓ జూనియర్ డాక్టర్‌పై రోగి తరఫు బంధువులు దాడి చేయడంతో జూడాలు విధులు బహిష్కరించారు. అత్యవసర సర్వీసులు కూడా నిలిపివేయడంతో రోగులు విలవిల్లాడారు. పరిస్థితి చేయి దాటిపోతుండటంతో డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) జూడాలను చర్చలకు ఆహ్వానించారు. సాయంత్రం సచివాలయంలో జరిగిన చర్చల్లో ప్రభుత్వం తరపున హోమంత్రి నాయిని నరసింహారెడ్డి, ఉపముఖ్యమంత్రి రాజయ్య  పాల్గొనగా, జూడాల తరపున హౌస్ సర్జన్ల సంఘం, తెలంగాణ వైద్యుల సంఘం, జూనియర్ డాక్టర్ల సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. సుమారు మూడు గంటల పాటు చర్చలు జరిగాయి. జూడాల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో సమ్మె విరమించారు.

పూర్తి రక్షణ కల్పిస్తాం : గాంధీ ఆస్పత్రి దగ్గర భద్రత మరింత పెంచుతామని డిప్యూటీ సీఎం రాజయ్య, హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఆస్పత్రిలో యాభై సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉస్మానియా ఆస్పత్రిలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు. తద్వారా దాడులకు పాల్పడిన వారిని గుర్తించి మెడికల్ యాక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆస్పత్రుల భద్రతకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)తో రక్షణ కల్పించాలనే డిమాండ్‌ను సీఎం కేసీఆర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగు పర్చడంతో పాటు ఖాళీలను భర్తీ చేసి, సేవలను మెరుగు పరుస్తామని తెలిపారు.

ఇదిలా ఉండగా, బుధవారం రాత్రి వరకు వైద్యుల సమ్మె కొనసాగడంతో రోగులు ఆందోళనకు దిగారు.ముగ్గురి అరెస్ట్: వైద్యునిపై దాడి చేసిన ఘటనలో ముగ్గురు నిందితులను చిలకలగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఘటనకు కారణమైన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు గ్రామానికి చెందిన జే.మల్లేష్ (30), టి.మధుకర్ (36), సీహెచ్ పాండు (30)లను బుధవారం మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రి దగ్గర అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు శ్రీనివాస్, సునీల్‌లు పరారీలో ఉన్నారు.
 

మరిన్ని వార్తలు