మాకు రక్షణ ఏదీ?

11 Jun, 2020 01:52 IST|Sakshi
బుధవారం గాంధీ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో నిర్వహిస్తున్న జూడాలు

తమపై దాడులను నిరసిస్తూ రోడ్డెక్కిన జూడాలు 

గాంధీ ఆస్పత్రి ఎదుట రాస్తారోకో... ట్రాఫిక్‌ జామ్‌

వైద్యసేవల్లో తీవ్ర జాప్యం.. రోగుల అసహనం

జూడాలతో వైద్యమంత్రి భేటీ 

దాడికి పాల్పడిన ఇద్దరి అరెస్ట్‌ 

గాంధీ ఆస్పత్రి : కోవిడ్‌ నోడల్‌ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తతల మధ్య సుమారు ఆరుగంటల పాటు హైడ్రామా నడిచింది. తమ ప్రాణాలకు రక్షణ కరువైందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ జూడాలు రోడ్డెక్కారు. ఆస్పత్రి ఎదుట సికింద్రాబాద్‌–ముషీరాబాద్‌ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. సీఎం కేసీఆర్, వైద్యమంత్రి ఈటల రాజేందర్‌ గాంధీ ఆస్పత్రికి వచ్చి స్పష్టమైన, లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని, అప్పటి వరకు ధర్నా విరమించేదిలేదని భీష్మించారు. ఈ కారణంగా ఆస్పత్రిలో వైద్యసేవల్లో తీవ్ర జాప్యం జరగడంతో కరోనా బాధితులు అసహనం వ్యక్తం చేశారు. రాస్తారోకోతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి ట్రాఫిక్‌ భారీగా స్తంభించింది. గాంధీలో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని కార్వాన్‌కు చెందిన కరోనా రోగి మంగళవారం రాత్రి మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని ఆరోపిస్తూ మృతుని కుమారుడు, మరో బంధువుతో కలసి వైద్యులు, సిబ్బందిపై ఇనుప చైర్‌తో దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ముగ్గురు జూడాలకు గాయాలు కాగా, భయభ్రాంతులకు గురైన జూడాలు మంగళవారం రాత్రే విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించిన సంగతి విదితమే.

ఈ నేపథ్యంలో జూడాలు, ఇంటర్నీస్, హౌస్‌ సర్జన్లు బుధవారం ఉదయం ఆస్పత్రి ప్రాంగణంలో ధర్నా కొనసాగించారు. రోగుల ప్రాణాలు కాపాడేందుకు కృషి చేస్తున్న తమ ప్రాణాలకే రక్షణ కరువైందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను అరెస్ట్‌ చేశామని ధర్నా విరమించాలని పోలీసులు, ఆస్పత్రి యంత్రాంగం విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోయింది. ధర్నా అనంతరం ఆస్పత్రి ప్రాంగణంలో ర్యాలీ నిర్వహించిన జూడాలు ముందస్తు పథకం ప్రకారం ఒక్కసారిగా బారికేడ్లను తొలగించి రోడ్డెక్కారు. ఈ క్రమంలో పోలీసులు, జూడాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటుచేసుకుని పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సుమారు ఆరుగంటల పాటు రోడ్డుపై బైఠాయించిన జూడాలు తమ డిమాండ్లు పరిష్కరించేంత వరకు విధులకు హాజరుకామని స్పష్టం చేశారు. సాయంత్రం 3 గంటల సమయంలో వైద్యమంత్రి కార్యాలయం నుంచి చర్చలకు రమ్మని కబురు అందినా, మంత్రే ఇక్కడకు రావాలని వారు పట్టుబట్టారు. తానే వస్తానని మంత్రి చెప్పడంతో రాస్తారోకో విరమించారు. ఈ క్రమంలో గాంధీ ఆస్పత్రికి రాకపోకలు సాగించే ప్రధాన ద్వారాన్ని మూసివేయడంతో వైద్యులు, ఇతర సిబ్బంది తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. జూడాల రాస్తారోకోను కవరేజ్‌ చేసేందుకు వెళ్లిన మీడియాను అనుమతించలేదు. దూరం నుంచే ఫొటోలు, వీడియోలు తీసుకోవాలని పోలీసులు ఆంక్షలు విధించారు. కరోనాకు మందు మీడియాను నియంత్రించడం కాదని జూడాలు ఫ్లకార్డులు ప్రదర్శించారు. 


బుధవారం గాంధీ ఆస్పత్రి ఎదుట నిరసన తెలుపుతున్న జూనియర్‌ డాక్టర్లు 

జూడాలపై దాడుల వెనుక అసలు కారణం ఏంటి?
జూడాలపై దాడుల వెనుక అసలు కారణం ఏంటనే అంశంపై చర్చ వైద్యవర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. పారిశుధ్యలోపం, వార్డ్‌బాయ్స్, పేషెంట్‌ కేర్‌ టేకర్లు, నర్సింగ్‌ సిబ్బంది, వైద్యులు తగినంతగా లేకపోవడమేనని భావిస్తున్నారు. ఏప్రిల్‌ 1న మర్కజ్‌ నుంచి వచ్చి కరోనా బారిన పడిన కుత్భుల్లాపూర్‌కు చెందిన వ్యక్తి (56) గాంధీ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందాడు. సదరు మృతుడు బాత్‌రూంకు వెళ్లి తిరిగివస్తూ కిందపడి మరణించాడు. మంగళవారం రాత్రి కూడా కర్వాన్‌కు చెందిన వ్యక్తి (55) కూడా సరిగ్గా అలాగే మృతి చెందాడు. ఈ రెండు ఘటనల్లో వైద్యులు, జూడాల నిర్లక్ష్యం లేదు. కాని దాడులు జరిగింది వైద్యులు, జూడాలపైనే. పారిశుధ్యం సరిగా ఉండి, తగినంత మంది షేషెంట్‌ కేర్‌ టేకర్లు, వార్డుబాయ్స్‌ ఉంటే పేషెంట్‌తోపాటు వెళ్లే వెసులబాటు ఉండేది. రోగి కిందపడి ప్రాణాలు పొగొట్టుకునే అవకాశం ఉండేది కాదని, ఇదంతా తమకు సంబంధం లేని విషయమని, దాడులు మాత్రం తమపైనే జరుగుతున్నాయని వైద్యులు, జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

దాడులకు పాల్పడిన ఇరువురి అరెస్ట్‌..
జూడాలపై మంగళవారం రాత్రి దాడులకు పాల్పడిన ఇరువురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. మృతుని కుమారుడు (26), సమీప బంధువు (42)లపై ఎపిడమిక్‌ డిసీజెస్‌ యాక్ట్‌ సెక్షన్‌ 3, తెలంగాణ మెడికేర్‌ యాక్ట్‌ సెక్షన్‌ 4తోపాటు ఐపీసీ 332, 188, 269, 270, 271 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించామని అన్నారు. 

వైద్యులపై దాడులు దురదృష్టకరం: ఈటల
సాక్షి, హైదరాబాద్‌: వైద్యులు, వైద్య సిబ్బందిపై దాడులు జరగడం దురదృష్టకరమని మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. ఇలాంటి దాడులను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం ఆయన జూడాలతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘కరోనా సమయంలో డాక్టర్లు తమ ప్రాణాలను పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలు కాపాడుతున్నారు. రోజుల తరబడి ఇంటికి వెళ్లకుండా పేషెంట్లకు చికిత్స అందిస్తున్నారు. ఇలా త్యాగం చేసి సమాజం కోసం పనిచేస్తున్న వారి మీద దాడులు చేయడం హేయమైన చర్య. ఇలాంటి సంఘటనలు ఎట్టి పరిస్థితుల్లో సహించం’అని అన్నారు. దాదాపు నాలుగు గంటల పాటు జూనియర్‌ డాక్టర్లతో చర్చించి వారి సమస్యలను సానుకూలంగా విన్నారు. హాస్పిటల్‌ డీసెంట్రలైజేషన్‌ అంశంపై సీఎం కేసీఆర్‌తో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని తెలిపారు. జూడాల కమిటీతో ప్రతి వారం గాంధీలోనే సమావేశమవుతానన్నారు. చర్యల తర్వాత జూడాలు ఆందోళన విరమించారని, ఈ సందర్భంగా వారికి ధన్యవాదములు తెలుపుతున్నామని మంత్రి పేర్కొన్నారు.

చర్చలు విఫలం.. ఆందోళన కొనసాగింపు
గాంధీ ఆస్పత్రి: చర్చలు సఫలం అయినట్లు, ఆందోళన విరమించినట్లు మంత్రి పేర్కొనగా, సమస్య పరిష్కారానికి మంత్రి ఈటలతో బుధవారం రాత్రి జరిగిన చర్చలు విఫలం అయినట్లు గాంధీ జూడా సంఘం ప్రతినిధులు లోహిత్, శశిధర్, వంశీ, హేమంత్‌ స్పష్టం చేశారు. సమస్యలు, డిమాండ్లను సీఎం దృష్టికి తీసుకువెళ్తానని మంత్రి అన్నారని, స్పష్టమైన హామీ లభించకపోవడంతో విధుల బహిష్కరణ కొనసాగుతుందని పేర్కొన్నారు. గురువారం ఉదయం మరోమారు అంతర్గత సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని జూడాల సంఘం ప్రతినిధులు తెలిపారు.

జూడాల నిరసనలకు సంబంధించిన ఫొటోల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు