ఇదేమి ఎంపిక..? 

19 Dec, 2018 09:26 IST|Sakshi
డీపీఓ కార్యాలయం వద్ద అభ్యర్థులు

సాక్షి, కొత్తగూడెం: తాజాగా విడుదల చేసిన జూనియర్‌ పంచాయతీ కార్యదర్శుల ఫలితాల్లో స్పష్టత అనేది లేకుండా ఫలితాలు విడుదల చేశారని పరీక్ష రాసిన పలువురు అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు. ఫలితాల విడుదలలో ఏమాత్రం పారదర్శకత పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు విడుదల చేయాల్సిన ఫలితాలను నిలిపివేసి ఇప్పుడు హడావిడిగా వెలువరించి ఆగమేఘాల మీద ధృవీకరణ పత్రాల పరిశీలన చేయడమేంటని ప్రశ్నిస్తున్నారు. సోమవారం రాత్రి ఫలితాలు విడుదల చేయడంతో పాటు కేవలం రెండు రోజుల వ్యవధిలోనే (ఈ నెల 20న) సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ అని ప్రకటించారు. దీంతో అనేకమంది అభ్యర్థులు మంగళవారం జిల్లా పంచాయతీ కార్యాలయానికి వచ్చి ఫలితాల జాబితా చూసి అవాక్కయ్యారు. అసలు ఏ ప్రాతిపదికన తుది జాబితాను ఎంపిక చేశారని పలువురు ప్రశ్నించారు.

పరీక్ష రాసిన తమకు ప్రశ్నపత్రం, ఓఎంఆర్‌ కార్బన్‌ షీట్‌ ఇవ్వలేదని చెబుతున్నారు. ఇక తాజాగా విడుదల చేసిన తుది ఫలితాల్లో అభ్యర్థులందరి మార్కుల జాబితా, మెరిట్, రిజర్వేషన్లు పాటించిన విధానం సక్రమంగా ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. అసలు పంచాయతీరాజ్‌ కమిషన్‌ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో రాసిన అభ్యర్థులందరి  మార్కుల వివరాలను పొందుపరచలేదని అంటున్నారు. పరీక్ష రాసిన అందరి మార్కుల జాబితాను వెబ్‌సైట్‌లో పెట్టిన తర్వాతే సర్టిఫికెట్లు పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు. గత అక్టోబర్‌ 10న జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లోని 37 కేంద్రాల్లో జూనియర్‌ పంచాయతీ కార్యదర్శి పోస్టులకు రాత పరీక్ష నిర్వహించారు. ఫలితాలు వెంటనే విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ ఎన్నికల నేపథ్యంలో నిలిపేశారు. జిల్లాలో మొత్తం 17,464 మంది దరఖాస్తు చేసుకోగా, 15,305 మంది పరీక్ష రాశారు. 

అందరి మార్కులు వెబ్‌సైట్‌లో పెట్టాలి 
పంచాయతీ కార్యదర్శి పరీక్ష రాసిన అభ్యర్థులందరి మార్కులను పంచాయతీరాజ్‌ కమిషనర్‌ అఫీషియల్‌ వెబ్‌సైట్‌లో పెట్టాలి. పైగా ఎలాంటి వివరాలు లేకుండా హాల్‌టికెట్‌ నంబర్లు మాత్రమే ఇస్తూ ఎంపిక జాబితా ప్రకటించడం సరికాదు. పరీక్ష రాసిన వారందరి మార్కులు బహిర్గతం చేస్తేనే పారదర్శకత ఉన్నట్లు. లేకుంటే అక్రమాలు జరిగినట్లే.          –  ధరావత్‌ సీతారాములు, అభ్యర్థి 

ఫలితాల ప్రకటనలో గందరగోళం 
పరీక్ష రాసిన అభ్యర్థులకు ప్రశ్నపత్రం ఇవ్వకపోవడంతో పాటు ఆన్సర్‌ షీట్‌కు సంబంధించిన కార్బన్‌ పేపర్‌ కూడా ఇవ్వలేదు. ఇక ఫలితాల్లో అందరి మార్కుల జాబితా, రిజర్వేషన్ల విధానం కూడా ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. అభ్యర్థులందరి మార్కులు ప్రకటించే వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ నిలిపేయాలి. వెంటనే అందరి మార్కుల జాబితా విడుదల చేయాలి.                                      –  మూడ్‌ బాలాజీ,  గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి 

మరిన్ని వార్తలు