అమ్మా...కడుపునొప్పి!

27 Jun, 2019 07:51 IST|Sakshi

పిల్లలలో సమతుల ఆహార లోపం

అల్పాహారం లేకుండానే బడికి..

చిరుప్రాయంలోనే గ్యాస్ట్రిక్‌ సమస్య

80 శాతం ఇళ్లల్లో ఇదే పరిస్థితి 

జంక్‌ఫుడ్‌తో అధిక బరువు ప్రమాదం

సాక్షి,సిటీబ్యూరో: మహానగరంలో జీవితాలు అన్నింటిలోనూ బిజీ అయిపోయాయి. చదువులోను.. సంపాదనలోను.. ఆహార్యంలోను.. అవకాశాలు అందుకోవడంలోనూ అంతా బిజీనే. ఇంట్లో ఎడాది వయసున్న పిల్లలు ఉంటే అప్పుడే ఏ స్కూల్లో జాయిన్‌ చేయాలి.. అక్కడ ఐఐటీ, అబాకస్‌ వంటి శిక్షణ ఇస్తున్నారా లేదా..! ఒలింపిక్స్‌కు శిక్షణనిస్తున్నా లేదా..!! ఇలాంటి విషయాలపై గంటల కొద్దీ ఆలోచించే తల్లిదండ్రులు పిల్లల ఆర్యోగం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నామనుకుంటూ వారిని సరిగా పట్టించుకోవడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. నగరంలో చాలా మంది తల్లిదండ్రులు ఉద్యోగాలు చేస్తున్నారు. దంపతులిద్దరూ వారివారి పనుల్లో బిజీగా ఉండి స్కూలుకు వెళ్లే తమ పిల్లలను సరిగా పట్టించుకోవడం లేదు.. వేళకు సరైన ఫౌష్టికాహారం పెట్టడం లేదు. ఉదయం అల్పాహారంలో భాగంగా నూటికి 80 శాతం మంది తల్లిదండ్రులు గ్లాసు పాలతో కడుపు నింపి స్కూలుకు పంపుతున్నారని కొన్ని అధ్యయనాల్లో తేలింది.

ఇంట్లో వంట చేసే సమయం లేక కొంతమంది.. ఓపిక లేక మరికొంత మంది తమ పిల్లలకు మార్కెట్లో రెడీమేడ్‌గా దొరికే ఫిజ్జాలు, బర్గర్లు, చిప్స్‌ ప్యాకెట్లు, ఎగ్, వెజ్‌ఫఫ్‌లు, సాండ్‌విచ్‌లు స్నాక్స్, లంచ్‌బాక్స్‌లో పెట్టి పంపుతున్నారు. రాత్రి డిన్నర్‌ తర్వాత ఉదయం ఫుల్‌మీల్‌కు బదులు.. గ్లాసు పాలతో సరిపెడుతుండటంతో తర్వాత కొద్దిసేపటికే కడుపు ఖాళీ కావడం గ్యాస్ట్రిక్‌ సమస్య తలెత్తి కడుపు నొప్పికి కారణమవుతున్నట్టు చిన్నపిల్లల వైద్యుల వద్దకు ఇటీవల పెరిగిన కేసుల సంఖ్యే చెబుతోంది. ఇది పిల్లల శారీరక ఆరోగ్యంపైనే కాకుండా మానసిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోందంటున్నారు వైద్యులు. ఇటీవల కాలంలో ఈ తరహా కేసులు తమ దృష్టికి ఎక్కువగా వస్తున్నట్లు పౌష్టికాహార నిపుణులు చెబుతున్నారు. పిల్లల ఎదుగుదలకు ఆహారం ఎంతముఖ్యమో.. వేళకు నిద్ర కూడా అంతే ముఖ్యమంటున్నారు.  

సమతులాహారం అవసరం 
నిజానికి ఏ వయసు పిల్లలకు ఎంత ఆహారం, ఎన్నిసార్లు అందించాలి వంటి అంశాలపై తల్లిదండ్రులకు కనీస అవగాహన ఉండడం లేదు. ఉదయాన్నే పిల్లలను నిద్రలేపడం, హడావుడిగా స్కూలుకి రెడీ చేయడం, అల్పాహారంలో గ్లాసు పాలు తాగించడం, స్నాక్స్, లంచ్‌ బాక్స్‌ల్లో బిస్కెట్లు పెట్టి పంపుతున్నారు. ఈ ఆహారంలో సరిపడ కార్పొహైడ్రేట్స్, ప్రొటీన్లు, పీచుపదార్థం, విటమిన్లు, మినరల్స్‌ లేకపోవడంతో పిల్లల శారీక, మానసిక ఎదుగుదలపై పభావం పడుతోంది. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా.. బాగా చదువుకోవాలన్నా వారీకి వేళకు సమతుల ఆహారం పెట్టాలి. ఏది పడితే అది కాకుండా త్వరగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తక్కువ కెలరీలు ఉండేవి పెట్టాలి. పాలు, పెరుగుతో పాటు ఆకు కూరలు, సీజనల్‌గా దొరికే పండ్లు, పప్పులు, కోడిగుడ్లు, డ్రైఫూట్స్‌ను స్నాక్స్‌గా అందించాలి. తద్వారా పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.     – డాక్టర్‌ అశ్వినీసాగర్,    పీడియాట్రిక్‌ న్యూట్రీషియన్‌  

ఇలా అయితే భారీ మూల్యం తప్పదు 
సాధారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అసలే వర్షాకాలం తరచూ వర్షపు నీటిలో తడవడం, కలుషిత నీరు తాగడం, నిల్వ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల త్వరగా జబ్బున పడే ప్రమాదం ఉంది. ఈ సీజన్‌లో పిల్లలు ఎక్కువగా దగ్గు, జలుబు, తలనొప్పి, టైఫాయిడ్, డెంగీ జ్వరం, వాంతులు, విరేచనాలు వంటి రోగాలకు గురవుతుంటారు. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల క్రానిక్‌ డిసీజ్‌గా మారే ప్రమాదం ఉంది. తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి ఉంది. వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు హైజీన్‌ పెంచాలంటున్నారు వైద్యులు. ఆహారం తీసుకునే సమయంలోనే కాదు.. తర్వాత కూడా చేతులను శుభ్రంగా కడగడం వారికి అలవాటు చేయాలి. కాచి, చల్లార్చిన నీరును తాగించడం ద్వారా డయేరియా ముప్పు నుంచి బయపడొచ్చు. ఎదిగే పిల్లలకు వేళకు సరైన ఆహారం అందించకపోవడం వల్ల వారి మానసిక, శారీర క ఎదుగుదలపై ప్రభావం పడటంతో పాటు చదువులోనూ వెనుకబడటం ఖాయమంటున్నారు వైద్యులు. లేదంటే తల్లిదండ్రులు తమ పిల్లల ఆరోగ్యంపై భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు