బంగారు తెలంగాణకు బాటలెయ్యండి

9 Mar, 2016 04:55 IST|Sakshi
బంగారు తెలంగాణకు బాటలెయ్యండి

స్థానికులకు ఉపాధి కల్పించాలని పరిశ్రమలకు మంత్రి జూపల్లి పిలుపు
ఆరో విడతలో 18 పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేత
రూ.2,167 కోట్ల పెట్టుబడులు, 13,817 మందికి ఉపాధి

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం(టీఎస్‌ఐపాస్)లో భాగంగా ఆరో విడతలో నూతనంగా ఏర్పాటయ్యే 18 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని డీ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.2,167.47 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా 13,817 మందికిఉపాధి దక్కుతుందని జూపల్లి వెల్లడించారు. ఈ పరిశ్రమల్లో కాగ్నిజెంట్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.655 కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా 8,500 మందికి ఉపాధి ఇవ్వనుందని వివరించారు. వీటితో పాటు ఒప్పందాలు చేసుకున్న ప్రముఖ పరిశ్రమల్లో ఐటీసీ, విన్సోల్, కెమో ఇండియా,  సురానా, ఎర్త్ సోలార్ మొదలైనవి ఉన్నాయన్నారు. ఆరు విడతల్లో జరిగిన ఒప్పందాలతో కలిపి మొత్తంగా రూ.33,101 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటిద్వారా 1,20,169 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిశ్రమల అనుమతులకు కనీసం 45 రోజులు పడుతుండగా, టీఎస్‌ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. అనుమతుల్లో జాప్యం మూలంగా పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎలాంటి ఆటంకాలు, అవినీతి లేని పారిశ్రామిక విధానానికి దేశ, విదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం ఖాయమని జూపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వీలైనంత త్వరగా ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా అనుమతులు అందుకున్న పారిశ్రామిక వేత్తలు టీఎస్‌ఐపాస్‌పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. గతంలో కంటే భిన్నంగా అధికారులే ముందుకు వచ్చి అనుమతులు ఇస్తున్నారని, తక్కువ సమయంలోనే ఆదేశాలు జారీ చేసి పరిశ్రమల స్థాపనకు మెరుగైన వాతావరణం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్‌ఐపాస్ ఎండీ వెంకట నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీ సైదా, అడిషనల్ డెరైక్టర్ దేవానంద్ పాల్గొన్నారు.

 

మరిన్ని వార్తలు