ఉపవర్గీకరణతోనే బీసీ కులాలకు న్యాయం

24 Feb, 2019 04:24 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జస్టిస్‌ రోహిణి. చిత్రంలో ఎంపీ బండారు దత్తాత్రేయ తదితరులు

జాతీయ ఓబీసీ వర్గీకరణ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రోహిణి

సాక్షి, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా దాదాపు 5వేలకు పైగా ఉన్న బీసీ కులాల వారికి న్యాయం జరగాలంటే ఉపవర్గీకరణతోనే సాధ్యపడుతుందని జాతీయ ఓబీసీ వర్గీకరణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ జస్టిస్‌ రోహిణి అభిప్రాయపడ్డారు.బీసీ వర్గీకరణ అనే అంశంపై దత్తాత్రేయ అధ్యక్షతన శనివారం ఎన్‌కేఎం గ్రాండ్‌ హోటల్‌లో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రోహిణి మాట్లాడుతూ ‘‘దేశంలో దాదాపు 5 వేలకు పైగా బీసీ కులాలున్నాయి. వీటిలో ఆరేడు మాత్రమే అభివృద్ధి చెందాయి. అన్నీ అభివృద్ధి చెందాలంటే బీసీ ఉప వర్గీకరణ చేయాలి. ఇది చేయకపోతే మరో 50 ఏళ్లయినా అత్యంత వెనుక బడిన కులాల్లో మార్పు రాదు. వృత్తుల ఆధారంగా కొన్ని బీసీ కులాలపై వివక్ష చూపించారు. ఎస్సీ, ఎస్టీ మాదిరిగా వెనకబడిన తరగతులు పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని రాజ్యాంగంలో పొందుపరచ లేదు. బీసీలకు చట్టసభల్లో ఇప్పటివరకు రిజర్వేషన్లు లేవు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి. చట్టసభల్లో అవకాశం కల్పిస్తేనే వారి పక్షాన మాట్లాడే అవకాశం ఉంటుంది. బీసీల్లో అభివృద్ధి చెందిన కులాలతో అభివృద్ది చెందనివి పోటీపడలేకపోతున్నాయని అన్నారు. ఉపవర్గీకరణతో అందరికీ న్యాయం జరుగు తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కులం ఇప్పటికీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనిషి అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అందరికీ అందాలి’’ అని అన్నారు. 

మోదీ వల్లే ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత..
బీసీల్లోని అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేసేందుకే ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారనీ, ఇది ప్రధాని నరేంద్రమోదీ ద్వారానే సాధ్యమైందని సభకు అధ్యక్షత వహించిన సికింద్రాబాద్‌ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘ఓబీసీ కమిషన్‌కు చట్టబద్దత కల్పించడం చరిత్రాత్మకం. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేకపోవడం వల్ల రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదు. ఎస్సీ ఎస్టీలకు జరిగినట్లుగా ఇంతకాలం బీసీలకు న్యాయం జరగలేదు. అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టా రీతిన కులాలను బీసీల్లో కలుపుకుంటూ పోయాయి. దేశంలో వేలాదిగా ఉన్న బీసీ కులాల ఉపవర్గీకరణకు ప్రధాని మోదీ నడుంకట్టి ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడం గొప్ప విషయం. ఈ కమిషన్‌ ద్వారా పేద వర్గాల బీసీలకు ఎంతో న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఈ సమావేశంలో 175 మంది బీసీ నేతలు, మేధావులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు