అవినీతి రహిత పాలన అందించేందుకే

19 Nov, 2017 01:44 IST|Sakshi

కొత్తపార్టీ ఏర్పాటుపై జస్టిస్‌ చంద్రకుమార్‌

దశలవారీ మద్య నిషేధం హామీ

హైదరాబాద్‌: అవినీతి రహిత పాలన అందించేందుకే కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తుగ్లక్‌ పాలన నడుస్తుందని, తమ పార్టీ అధికారంలోకి వస్తే తెలంగాణను రైతు ఆత్మహత్యల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పార్టీ పేరును డిసెంబర్‌ చివరిలోగాని, జనవరిలో గాని ప్రకటిస్తామని, ఆలోపు రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేయనున్నట్లు తెలిపారు.

దశలవారీగా మద్య నిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. నిజాయతీతో పనిచేసే ఏ పార్టీలు వచ్చినా వారితో కలసి పనిచేస్తామన్నారు. అనంతరం గద్దర్‌ మాట్లాడుతూ.. ఎలాంటి వివాదాల్లేకుండా జస్టిస్‌గా విధులు నిర్వహించిన చంద్రకుమార్‌ ద్వారానే సామాజిక తెలంగాణ సాధ్యమన్నారు. కార్యక్రమంలో అరుణోదయా సాంస్కృతిక సమాఖ్య ప్రతినిధి విమలక్క, ప్రొఫెసర్‌ తిరుమలి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్, ప్రొఫెసర్‌ మురళీ మనోహర్, పాశం యాదగిరి, నిర్మల, సౌగరాబేగం పాల్గొన్నారు.  

పార్టీ తాత్కాలిక కార్యవర్గం ఎన్నిక
త్వరలో ఏర్పాటు చేయనున్న కొత్తపార్టీ తాత్కాలిక కమిటీని జస్టిస్‌ చంద్రకుమార్‌ ప్రకటించారు. పార్టీ అధ్యక్షుడిగా జస్టిస్‌ చంద్రకుమార్, ముఖ్య సలహాదారులుగా తిరుమలి, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ప్రభాకర్, ప్రొ.మురళీ మనోహర్, బాల లక్ష్మణ్, ఈశ్వరయ్య, ఏఎల్‌ మల్లయ్య, ప్రధాన కార్యదర్శులుగా టీవీ రామనర్సయ్య, పి.మోహన్‌ రాజ్, సాంబశివగౌడ్, పాలె విష్ణు, ఉపాధ్యక్షులుగా ఆకుల భిక్షపతి, నిర్మల, ప్రకాష్, లచ్చన్న, వేదవికాస్‌లను ఎన్నుకున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు