కేంద్రం వద్ద జడ్జీల పెంపు ప్రతిపాదన

16 Aug, 2019 02:19 IST|Sakshi
హైకోర్టు ప్రధాన భవనం వద్ద జెండా వందనం చేస్తున్న చీఫ్‌ జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌

స్వాతంత్య్ర వేడుకల్లో హైకోర్టు సీజే 

సాక్షి, హైదరాబాద్‌: హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంపుదల చేయాలనే ప్రతిపాదన కేంద్రం వద్ద ఉందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. దీనిపై కేంద్రం త్వరలోనే ఆమోదం తెలిపే అవకాశముందని ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీతోపాటు 24 నుంచి 42 మందికి సంఖ్య పెంపు ప్రతిపాదనను కేంద్రం ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. 
స్వాతంత్య్ర వేడుకలను పురస్కరించుకొని గురు వారం హైకోర్టు ప్రధాన భవనం వద్ద సీజే జెండా ఎగుర వేసి.. ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవం, రక్షాబంధన్‌ శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి స్వాతంత్య్ర ఫలాలు అందించడంలో ఎందరో మహనీయుల త్యాగాలున్నాయన్నారు. హైకోర్టు లో సాంకేతికతను పుణికిపుచ్చుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, హైకోర్టును పేపర్‌లెస్‌ చేయబోతున్నట్లు తెలిపారు. తీర్పు వెలువడిన ఒకట్రెండు రోజుల్లో తీర్పుల ప్రతులు ఆన్‌లైన్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అందరికీ న్యాయ ఫలాలు అందించడంలో కోర్టుల పాత్ర ఎనలేనిదని రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ చైర్మన్‌ ఎ.నర్సింహారెడ్డి కొనియాడారు.  కార్యక్రమంలో అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్య క్షుడు సూర్యకరణ్‌రెడ్డి మాట్లాడారు. పలువురు న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్‌లో మంచి మార్కులు సాధించిన హైకోర్టు ఉద్యోగుల పిల్లలకు సీజే బహుమతులు ప్రదానం చేశారు. 

మరిన్ని వార్తలు