బీసీ జనాభా లెక్కలు వెల్లడించాలి

17 Dec, 2018 02:04 IST|Sakshi
అభివాదం చేస్తున్న జస్టిస్‌ ఈశ్వరయ్య, జాజుల శ్రీనివాస్‌ గౌడ్, ఉ.సాంబశివరావు, బీసీ సంఘాల నాయకులు

జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య

హైదరాబాద్‌: స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు నిలుపుకోవాలంటే ముందుగా వారి జనాభా లెక్కలు వెల్లడించాలని జాతీయ బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య డిమాండ్‌ చేశారు. పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీలందరికీ న్యాయం జరిగేలా ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నా జనాభా లెక్కలే ప్రామాణికమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బీసీ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘పంచాయతీరాజ్‌ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల తగ్గింపు – భవిష్యత్‌ కార్యాచరణ’ అనే అంశంపై ఆదివారం ఇక్కడ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సమావేశంలో పలువురు బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా జస్టిస్‌ ఈశ్వరయ్య మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికల్లో 24 ఏళ్లుగా బీసీలకు 34%గా ఉన్న రిజర్వేషన్లను 24శాతానికి కుదించడం సరికాదన్నారు. ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేని దుస్థితిలో బీసీ కమిషన్‌ ఉండటం శోచనీయమన్నారు. సమగ్ర కుటుంబ సర్వేను ఒక్కరోజులో పూర్తిచేయగలిగిన ప్రభుత్వానికి బీసీ జనాభా లెక్కలను వెలికి తీయడం ఎంతసేపని ప్రశ్నించారు. బీసీలు 52% కన్నా తక్కువగా లేరని, వారిని ఏబీసీడీలుగా వర్గీకరిస్తేనే పంచాయతీ ఎన్నికల్లో సమన్యాయం జరుగుతుందని సూచించారు.  

అధికారులే నిర్వీర్యం చేస్తున్నారు 
ఈ సమావేశంలోనే బీసీ రిజర్వేషన్ల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కన్వీనర్‌గా ఎన్నికైన జాజుల శ్రీనివాస్‌ మాట్లాడుతూ...స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారులు, ఎన్నికల శాఖ అధికారులు రిజర్వేషన్లను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సుప్రీంకోర్టులో అడిషనల్‌ ఏజీపీతో వాదనలు వినిపించడం వల్లే రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు వచ్చిందన్నారు. న్యాయనిపుణులు, సామాజిక ఉద్యమకారులతో చర్చించి రిజర్వేషన్ల పంచాయతీకి శాశ్వత పరిష్కారం చూపాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు.

రిజర్వేషన్ల పరిరక్షణకు అవసరమైతే ఆమరణ దీక్షకు దిగుతామని హెచ్చరించారు. సామాజిక విశ్లేషకులు ఉ.సాంబశివరావు మాట్లాడుతూ.. బీసీ లెక్కలు లేకపోవడానికి పాలకులే కారణమన్నారు. బీసీలకు 54% రిజర్వేషన్లు ఇవ్వాలని పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ యునైటెడ్‌ ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు పాలూరి రామకృష్ణయ్య, బీసీ కుల సంఘాల జేఏసీ చైర్మన్‌ కె.గణేశ్‌చారి, ఎంబీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బంగారు నర్సింహ్మ సగర, బీసీ,ఎస్సీ,ఎస్టీ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ యాదవ్, ప్రొఫెసర్‌ రమ, ఎస్‌.లక్ష్మి ముదిరాజ్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు