ఇకనేరుగా కోర్టులకు! 

16 Dec, 2018 02:57 IST|Sakshi
కొత్త వ్యవస్థను ప్రారంభిస్తున్న జస్టిస్‌ లోకూర్‌

     ఎఫ్‌ఐఆర్‌ నుంచి చార్జిషీట్‌ వరకు.. 

     పోలీస్‌స్టేషన్ల నుంచి నిమిషాల్లో చేరనున్న కేసుల వివరాలు 

     నూతన వ్యవస్థను ప్రారంభించిన జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ 

హైదరాబాద్‌: పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాగానే క్షణాల్లో సంబంధిత కోర్టుకు ఆన్‌లైన్‌లో సమాచారం చేరనుంది. చార్జిషీట్‌ సైతం నిమిషాల్లో జడ్జి ముందు కన్పిస్తుంది. ఇలాంటి వ్యవస్థను న్యాయవ్యవస్థ దేశవ్యాప్తంగా ఇటీవల రూపొందించింది. ఇంటర్‌ ఆపరేటబుల్‌ క్రిమినల్‌ జస్టిస్‌ సిస్టం (ఐసీజేఎస్‌) పేరుతో నూతన ప్రాజెక్టును పోలీస్‌ శాఖ, న్యాయవ్యవస్థ మధ్య అనుసం«ధానంగా ప్రవేశపెట్టారు. ఈ ఐసీజేఎస్‌ను శనివారం ఈ వ్యవస్థ చైర్మన్‌ జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. 

దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్‌.. 
ఐసీజేఎస్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్న న్యాయవ్యవస్థ పైలట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా రాష్ట్ర పోలీస్‌ను ఎంచుకుంది. ఇందులో భాగంగా వరంగల్‌ కమిషనరేట్‌లోని సుబేదారి పోలీస్‌స్టేషన్‌ను అనుసంధానం చేస్తూ జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కోర్టు, పోలీసుల సమన్వయం ద్వారానే కేసులను త్వరితగతిన పరిష్కరించగలమని పేర్కొన్నారు. త్వరితగతిన కేసులను పరిష్కరించడంతో పాటు బాధితులకు సత్వర న్యాయం కల్పించేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఐసీజేఎస్‌ రూపొందించినట్లు తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌ కాపీతో పాటు చార్జిషీట్లు కూడా పోలీస్‌ సిబ్బంది స్థానిక కోర్టుకు అందజేయడంతో పాటు సీసీ నంబర్లు, వారంట్లు, సమన్లను కూడా కోర్టు ద్వారా పోలీస్‌ సిబ్బంది పొందాలని సూచించారు. క్రైమ్, క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌)లో తెలంగాణ ముందు నుంచీ మొదటి స్థానంలో నిలుస్తూ వస్తోంది. రాష్ట్ర పోలీస్‌ శాఖ తీసుకొచ్చిన టీఎస్‌కాప్‌ తదితర యాప్‌లు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. 

జవాబుదారీతనం పెరుగుతుంది: డీజీపీ 
ఐసీజేఎస్‌ వ్యవస్థతో పోలీస్‌స్టేషన్ల అనుసంధానం వల్ల పోలీసుల్లో జవాబుదారీతనం మరింత పెరుగుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థ ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థలో పైలట్‌ ప్రాజెక్టుగా వరంగల్‌ సుబేదారి పోలీస్‌ స్టేషన్‌ను అనుసంధానించడం రాష్ట్ర పోలీస్‌ శాఖకు మరో మైలురాయి అని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌కు ధన్యవాదాలు తెలిపారు. ప్రాజెక్టులో కీలకంగా పనిచేస్తున్న పోలీసు కంప్యూటర్‌ సర్వీసెస్‌ అదనపు డీజీపీ రవిగుప్తా, వరంగల్‌ కమిషనర్, ఇతర అధికారులను డీజీపీ అభినందించారు.

మరిన్ని వార్తలు