‘న్యాయం కోసం వచ్చేవారికి బాసటగా నిలవాలి’

28 Jul, 2019 16:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత న్యాయవ్యవస్థలో పెండింగ్‌లో ఉన్న కేసులు సమస్యగా మారాయని.. న్యాయం కోసం కోర్టుకు వస్తున్న వారి  పట్ల శ్రద్ధ వహించాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ పేర్కొన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లో నిర్మించిన సిటీ సివిల్‌ కోర్టు ఫేస్‌ వన్‌ భవనాన్ని జస్టిస్‌ ఠాకూర్‌ ఆధ్వర్యంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ మాట్లాడుతూ.. ఈ కోర్టు భవనంలోని న్యాయముర్తుల ఛాంబర్లు సుప్రీం కోర్టు, హైకోర్టు ఛాంబర్ల కంటే బాగున్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా సమాజంలో ఏ వృత్తికి లేని గౌరవం న్యాయముర్తుల వృత్తికి ఉందని.. కావున న్యాయం కోసం వచ్చేవారికి, ప్రజల హక్కులకు బాసటగా నిలవాలని తెలిపారు. దీంతోపాటు న్యాయ వ్యవస్థను గౌరవించి.. కోర్టుకు వచ్చే వారి సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. ఈ సమాజం న్యాయమూర్తులకు చాలా గౌరవం ఇస్తుంది.. అందుకే సమాజం కోసం సేవ చేయాలన్నారు. అయితే చాలా కేసుల్లో సాక్షి కోర్టుకు రావటం గగనం అవుతోందని.. సాక్షులను గౌరవించి కాపాడుకోవాలని అయన పేర్కొన్నారు. కాగా న్యాయ వ్యవస్థలో సీనియర్లు తల్లిదండ్రుల వంటి వారని.. అందరిని గౌరవించి, న్యాయ వ్యవస్థపై మరింత గౌరవాన్ని పెంపొందించాలని తెలిపారు.  

ఈ కార్యక్రమంలో సుప్రీం కోర్టు న్యాయముర్తి జస్టిస్‌ సుభాష్ రెడ్డి మాట్లాడుతూ.. సుమారు రూ. 12 కోట్ల వ్యయంతో కోర్టు కోసం మంచి భవనం నిర్మించినందుకు సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా న్యాయవ్యవస్థకు లోబడే మనమంతా పని చేయాలని పేర్కొన్నారు. గతం కంటే ప్రస్తుతం ఎన్నో మార్పులు వచ్చాయని తెలిపారు. అనంతరం సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థ కోసం మౌలిక సదుపాయాలు అందించే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు