మార్పు కోసం న్యాయస్థానాలే ప్రయత్నించడం లేదు

10 Jun, 2018 00:34 IST|Sakshi

అఖిల భారత న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్‌

సాక్షి, హైదరాబాద్‌: న్యాయవ్యవస్థలో మార్పునకు ఉన్నత న్యాయస్థానాలు ఉద్దేశపూర్వకంగానే ప్రయత్నించడం లేదని విశ్రాంత న్యాయమూర్తి, అఖిల భారత న్యాయాధికారుల సంఘం అధ్యక్షుడు జస్టిస్‌ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. న్యాయవ్యవస్థలో ఇప్పటికీ బ్రిటిష్‌ కాలం నాటి వ్యవస్థే కొనసాగుతోందన్నారు. దక్షిణాది రాష్ట్రాల న్యాయాధికారుల సమావేశంలో పాల్గొనడానికి హైదరాబాద్‌ వచ్చిన ఆయన సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు.

సామాన్యుడికి సత్వర న్యాయం అందడం లేదంటే, వ్యవస్థలోని లోపాలే అందుకు కారణమని చెప్పారు. వ్యవస్థలో మార్పు రాకుండా సత్వర న్యాయం సాధ్యం కాదన్నారు. క్రిమినల్‌ కేసుల్లో 40 ఏళ్ల తర్వాత తీర్పు వెలువడితే ప్రయోజనం ఏముంటుందని ప్రశ్నించారు. సివిల్, క్రిమినల్‌ కేసుల విచారణకు నిర్ధిష్ట కాలపరిమితి విధిం చాల్సిన అవసరముందన్నారు. నియామకాలు, పదోన్నతులు సకాలంలో జరగడం లేదని, న్యాయాధికారులు ఉద్యోగం లో చేరిన హోదాతోనే పదవీ విరమణ చేస్తున్నారని అన్నారు.

అందరికీ సత్వర, సమాన న్యాయం అందినప్పుడే న్యాయస్థానాల ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. కింది కోర్టుల్లో న్యాయాధికారులపై ఆరోపణలు వచ్చినప్పుడు హైకోర్టు అంతర్గత విచారణ చేపట్టడం మంచిదన్నారు. సమావేశం అనంతరం న్యాయాధికారుల సంఘం ప్రతినిధులు వేతనాలు పెంపు, ఇతర సమస్యలపై జాతీయ జ్యుడీషియల్‌ పే కమిషన్‌ చైర్మన్‌ జస్టిస్‌ పి.వెంకటరామారెడ్డిని కలసి వినతిపత్రం సమర్పించారు.  

మరిన్ని వార్తలు