మెడికల్‌ ఫీజు కేసు మరో ధర్మాసనానికి..

19 May, 2020 03:25 IST|Sakshi

విచారణ నుంచి తప్పుకున్నజస్టిస్‌ రామచంద్రరావు ధర్మాసనం

ఈ వ్యాజ్యంపై నేడు విచారించనున్నసీజే ధర్మాసనం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యంలో విచారణ నుంచి న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు, జస్టిస్‌ కె.లక్ష్మణ్‌లతో కూడిన ధర్మాసనం తప్పుకుంది. ఈ వ్యాజ్యాన్ని మరో ధర్మాసనానికి నివేదించేందుకు వీలుగా ఈ కేసుకు సంబంధించిన అన్నీ ఫైళ్లను ప్రధాన న్యాయమూర్తి (సీజే) ముందు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశించింది. మెడికల్‌ కాలేజీల్లో ఫీజుల పెంపు ఉత్తర్వులపై దాఖలైన వ్యాజ్యాన్ని జస్టిస్‌ రామచంద్రరావు ధర్మాసనం విచారించడంపై ప్రవేశాలు, ఫీజు నియంత్రణ కమిటీ (ఏఎఫ్‌ఆర్‌సీ) చైర్మన్, హైకోర్టు రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్‌ పి.స్వరూప్‌రెడ్డి ఓ మెమో ద్వారా చేసిన ఆరోపణలను ధర్మాసనం తోసిపుచ్చింది.

జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి చేసిన ఆరోపణలు నేరపూరిత కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని, అయినప్పటికీ తాము కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించడం లేదని ధర్మాసనం తెలిపింది. జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి తన ఆరోపణల ద్వారా న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకున్నట్లయిందని పేర్కొంది. కేసులో ఓడిపోయిన వ్యక్తులు ఇలా న్యాయమూర్తులపై ఆరోపణలు చేస్తూ వెళుతుంటే, న్యాయమూర్తులు తమ విధులను నిర్వర్తించడం కష్టమవుతుందని తెలిపింది. హైకోర్టులో ఉన్న మూడు వేల మందికి పైగా న్యాయవాదులకు తమ నిష్పాక్షిత, స్వతంత్రత గురించి తెలుసునని వివరించింది.

జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఆరోపణలు చేశారని పేర్కొంది. తమ ప్రవర్తన, విశ్వసనీయత గురించి తెలంగాణ ప్రజలు, న్యాయవాదులకు బాగా తెలుసునని వెల్లడించింది. ఈ మేరకు జస్టిస్‌ స్వరూప్‌రెడ్డి దాఖలు చేసిన మెమోపై ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత ఫీజుల పెంపు ఉత్తర్వులపై పిటిషన్‌ దాఖలు చేసిన 121 మంది వైద్య విద్యార్థుల తరఫు న్యాయవాది సామా సందీప్‌రెడ్డి తమ వ్యాజ్యం గురించి సీజే జస్టిస్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. అత్యవసర విచారణ జరపాల్సిన అవసరం ఉందని వివరించారు. దీనిపై స్పందించిన సీజే ధర్మాసనం మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. 

మరిన్ని వార్తలు