జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు ఘనంగా వీడ్కోలు

1 Nov, 2018 01:54 IST|Sakshi
రెండు రాష్ట్రాల హైకోర్టు న్యాయవాద సంఘాల ప్రతినిధులతో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్తున్న ఉమ్మడి హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన మొదటి కోర్టు హాల్లో జరిగిన వీడ్కోలు కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తులు, సిబ్బంది, పెద్ద సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ.. జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ విలువలకు కట్టుబడిన వ్యక్తి అని, రాజీలేని మార్గంలో, చట్టానికి లోబడి పనిచేశారని కొనియాడారు. నిరంతరం అధ్యయనం చేసే జస్టిస్‌ రంగనాథన్‌ 31,487 కేసుల్ని పరిష్కరిస్తే.. అందులో ఫుల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పులు 36 ఉన్నాయన్నారు.

అనంతరం జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ మాట్లాడుతూ.. చట్ట నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం వల్ల చాలామంది న్యాయవాదులు నొచ్చుకుని ఉంటారని, దీంతో ఈ కార్యక్రమానికి పెద్దగా న్యాయవాదులు రారేమోనని భావించానన్నారు. అయితే పెద్ద సంఖ్యలో వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు. తనకు విధుల్లో సహకరించిన తోటి న్యాయమూర్తులు, న్యాయాధికారులు, సిబ్బంది, న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, తెలంగాణ అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ జె.రామచందర్‌రావు మాట్లాడుతూ.. చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ పాటుపడ్డారని చెప్పారు.
 
న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో:
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హైకోర్టు న్యాయవాద సంఘాల ఆధ్వర్యంలో జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ రాధాకృష్ణన్‌ హాజరయ్యారు. రెండు సంఘాల అధ్యక్షులు, కార్యవర్గసభ్యులు కలసి సీజే చేతుల మీదుగా జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌కు జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ భార్య హాజరయ్యారు.  

>
మరిన్ని వార్తలు