జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కెయిత్‌కు వీడ్కోలు

11 Oct, 2018 01:34 IST|Sakshi
జస్టిస్‌ కెయిత్‌కు జ్ఞాపికను అందజేస్తున్న తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాద సంఘాలు. చిత్రంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాధాకృష్ణన్‌

సాక్షి, హైదరాబాద్‌: ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్న తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ సురేష్‌కుమార్‌ కెయిత్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టి.రాధాకృష్ణన్‌ అధ్యక్షతన బుధవారం మొదటి కోర్టు హాల్లో ప్రత్యేకంగా జరిగిన వీడ్కోలు సమావేశానికి న్యాయమూర్తులు, తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌.ప్రసాద్, ఏపీ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోసాని వెంకటేశ్వరరావు, పలువురు న్యాయవాదులు హాజరయ్యారు. అనంతరం సీజే జస్టిస్‌ రాధాకృష్ణన్‌ మాట్లాడుతూ, న్యాయవ్యవస్థకు జస్టిస్‌ కెయిత్‌ అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు.

న్యాయమూర్తిగా సేవలు అందించేందుకు తెలుగు రాష్ట్రాల్లో తనకు సంపూర్ణ సహకారాలు లభించాయని జస్టిస్‌ కెయిత్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్‌ కెయిత్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. అనంతరం తెలంగాణ, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘాలు కూడా జస్టిస్‌ కెయిత్‌ను సత్కరించాయి. హరియాణాకు చెందిన జస్టిస్‌ కెయిత్‌ 1963లో జన్మించారు. 1987లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యాక కేంద్ర ప్రభుత్వం తరఫున పలు కేసులు వాదించారు. 2008లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన ఆయన 2016లో తెలంగాణ, ఏపీ ఉమ్మడి హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇప్పుడు తిరిగి ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్తున్నారు.

మరిన్ని వార్తలు