మాజీ మంత్రి జువ్వాడి కన్నుమూత

10 May, 2020 09:09 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్రావు(93) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రత్నాకర్‌రావు నేడు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీనియర్ నాయకుల్లో ఒకరైన జువ్వాడి రాజకీయ దక్షత ఉన్ననేతగా పేరుగాంచారు. ధర్మపురి సమీపంలోని తిమ్మాపూర్‌ ఆయన స్వస్థలం. సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన ల్యాండ్స్ అండ్ మెజర్‌మెంట్స్ బ్యాంక్ చైర్మన్‌గా, జగిత్యాల సమితి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1983లో జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి పాలయ్యారు. 

1989లో బుగ్గారం నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచారు. కేంద్ర మాజీ మంత్రి శివశంకర్ అల్లుడు భీమ్‌సేన్‌ను ఓడించిన జువ్వాడి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తరువాత కాంగ్రెస్ అనుబంధ సభ్యుడిగా కొనసాగారు. 1999, 2004లో వరసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి.. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పని చేశారు. అయితే 2009 ఎన్నికల్లో కోరుట్ల నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన ఓటమిపాలయ్యారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఇటీవల కరీంనగర్‌లోని తన నివాసానికి తరలించారు. ఆదివారం తెల్లవారు జామున చల్మెడ ఆనందరావు ఆసుపత్రిలో అనారోగ్యంతో జువ్వాడి తుది శ్వాస విడిచారు. ఆయనకు ఇద్దరు కుమారులు నర్సింగరావు, కృష్ణా రావు ఉన్నారు. కాగా, రత్నాకర్‌రావు మృతదేహానికి మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, గంగుల కమలాకర్‌, మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావులు నివాళులర్పించారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా