పెద్దనోట్లపై అపోహల తొలగింపునకు సదస్సులు

12 Dec, 2016 13:51 IST|Sakshi
పెద్దనోట్లపై అపోహల తొలగింపునకు సదస్సులు

బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్  
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ప్రజల్లో అవగాహనను కల్పించడంతో పాటు అపోహలు తొలగించేందుకు సదస్సులను నిర్వహిస్తున్నట్లు బీజేపీ అధ్యక్షుడు డా.కె.లక్ష్మణ్ తెలిపారు. పార్టీ పాలసీ రీసెర్చ్ గ్రూప్ ఆధ్వర్యంలో శనివారం ‘‘పెద్ద నోట్ల రద్దు-ఆవశ్యకత, ప్రభావం, పరిణామాలు’’అనే అంశంపై నిర్వహించిన చర్చాగోష్టిలో ఆయన మాట్లాడారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయం దేశ బాగోగుల కోసం తీసుకున్న నిర్ణయమని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఇదెంతో ఉపకరిస్తుందన్నారు.

ఈ నిర్ణయం దృష్ట్యా ప్రజలకు అసౌకర్యం కలగకుండా సేవలందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నల్లధనం, అవినీతి నియంత్రణకు మోదీ ప్రభుత్వం తీసుకున్న సాహసోపేత నిర్ణయాన్ని విపక్షాలు ఉద్దేశపూర్వకంగా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో న్యాయ, బ్యాంకింగ్, పోలీస్, ఆర్థిక నిపుణులను భాగస్వాములను చేసి ప్రజల అపోహలను దూరం చేసేందుకు పార్టీ ఆధ్వర్యంలో చర్చా గోష్టులను నిర్వహిస్తు న్నామన్నారు.

రూ. 2వేల నోటు ఎందుకు తీసుకొచ్చారో చెప్పాలి
ఈ సదస్సులో కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో మళ్లీ రూ.2 వేల నోటును ఎందుకు తీసుకొచ్చారో చెప్పాల్సి ఉందని అన్నారు. వివిధ ప్రజావసరాలకు ప్రజలు చెల్లించే బిల్లులను రెండు నెలల పాటు వారుుదా వేయాలని సూచించారు. దేశానికి పట్టిన కుళ్లు వదలాలంటే మోదీ మరో రెండు పర్యాయాలు గెలవాల్సిన అవసరం ఉందని జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి అభిప్రాయపడ్డారు. మోడీకి సంకల్పం, ధైర్యం రెండూ ఉన్నారుు కాబట్టి ఈ నిర్ణయాన్ని అమలు చేయగలిగారన్నారు. మోదీ కారణజన్ముడని.. ఇది అతిశయోక్తి ఎంతమాత్రం కాదని అన్నారు. పెద్దనోట్ల రద్దుతో ఉగ్రవాదులు, విభజన శక్తులు జమ్మూ కశ్మీర్‌లోనో, మరోచోటో ఏదో ఒక చర్యకు దిగే అవకాశం ఉందని మాజీ డీజీపీ అరవిందరావు అభిప్రాయపడ్దారు.

ఈ నిర్ణయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోదని, రియల్ ఎస్టేట్ అసంఘటిత రంగంపై కొంత ప్రభావం పడుతుందని క్రెడాయ్ మాజీ అధ్యక్షుడు సి.శేఖర్‌రెడ్డి అన్నారు. బీజేపీ పాలసీ రీసెర్చ్ గ్రూప్ కన్వీనర్ జీఆర్ కరుణాకర్ అధ్యక్షతన జరిగిన ఈ గోష్టిలో ఎస్‌బీఎం మాజీ ఎండీ ఎం. సీతారామమూర్తి, ఆర్థిక నిపుణులు కె.నరసింహమూర్తి, పారిశ్రామికవేత్త అనిల్‌రెడ్డి, సీనియర్ జర్నలిస్టు జి. వల్లీశ్వర్, ప్రొ. వాసుదేవాచారి (ఓయూ) తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు