ప్రేమ్‌కుమార్‌ హత్య హేయమైనది

7 Jun, 2019 05:37 IST|Sakshi

హత్యా రాజకీయాలను నిలువరిస్తాం: కె.లక్ష్మణ్‌

మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌: దేవరకద్ర మండలం డోకూరులో బీజేపీ కార్యకర్త ప్రేమ్‌కుమార్‌ హత్య హేయమైనదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ అన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు బీజేపీ కార్యకర్తలను భయబ్రాంతులకు గురిచేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరిం చారు. రాజ్యాంగబద్ధంగా నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని, ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. గురువారం దేవరకద్ర మండలం డోకూరులో ప్రేమ్‌కుమార్‌ కుటుంబసభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. నమ్మి న సిద్ధాంతాల కోసం ఎంపీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పనిచేసిన ప్రేమ్‌కుమార్‌ను అధికార పార్టీ నాయకులు వేట కొడవళ్లతో నరికి చంపారని, దీన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు.

ఈ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీకి పెరిగిన ఓటు బ్యాంకు, ఫలితాలు టీఆర్‌ఎస్‌ నాయకులకు మింగుడు పడటం లేదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌ కుమార్తె కవిత, సన్నిహితుడు వినోద్‌ ఓడిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. దొడ్డిదారిన గ్రామాల్లోని బీజేపీ కార్యకర్తలను అణచివేస్తామంటే అది టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల అవివేకమేనన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కితే తిరుగుబాటు తప్పదని, హత్యా రాజకీయాలను నిలువరిస్తామని అన్నారు.  

ప్రేమ్‌కుమార్‌ కుటుంబాన్ని ఆదుకుంటాం
ప్రేమ్‌కుమార్‌ కుటుంబాన్ని బీజేపీ ఆదుకుంటుందని, ఇకపై ఆ కుటుంబ బాధ్యతను పార్టీయే తీసుకుంటుందని లక్ష్మణ్‌ తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి విజయరామారావు, పద్మజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు